ఉత్తరాంధ్రపై దండయాత్ర అంటూ అమరావతి రైతుల పాదయాత్రపై స్పీకర్ దగ్గర్నుంచి గుడివాడ అమర్నాథ్ వరకూ అందరూ వరుసపెట్టి ప్రకటనలు ఇచ్చారు. అయితే అవి మామూలు రాజకీయ ప్రకటనల్లాగే మిగిలిపోయాయి. ఎవరూ పట్టించుకోలేదు. ప్రజలు పట్టించుకోలేదు. వారు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని అక్కడి ప్రజలకూ అర్థమైంది. నిజానికి అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు ఏ ఒక్క ప్రాంతం నుంచి అభ్యంతరం వ్యక్తం కాలేదు. చివరికి జగన్ కూడా సమర్థించారు. అంతా ఏకగ్రీవంగా రాజధానిని ఎంపిక చేశారు.
అప్పుడే రైతులు భూములు ఇచ్చారు. ఇప్పుడు రైతుల్ని నట్టేట ముంచడానికి ప్రజలు కూడా సిద్ధంగా లేరు. ముందుగా అంగీకరించి తర్వాత మాట మార్చి రైతుల్ని ముంచడం కరెక్ట్ కాదని ఎక్కువ మంది అనుకుంటున్నారు. అదే సమయంలో రాజధాని పేరుతో విశాఖలో మూడున్నరేళ్లుగా సాగుతున్న విధ్వంసం కళ్ల ముందే కనిపిస్తోంది. ఏ చట్టాన్ని.. ఏ రాజ్యాంగాన్ని పట్టించుకోవడం లేదు. భూములన్నింటినీ స్వాధీనం చేసుకుంటున్నారు. ఇక అధికారిక రాజధానిగా వస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అక్కడి ప్రజలకు అర్థమైపోతోంది. అందుకే వైసీపీనేతల ప్రకటనలకు ఎక్కడా స్పందన రావడం లేదు.
ఇప్పటికే అమరావతి రైతులు గతంలో హైకోర్టు నుంచి తిరుమల వరకూ పాదయాత్ర చేశారు. అప్పట్లో కూడా వైఎస్ఆర్సీపీ నేతలు పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రకటనలు చేశారు. కానీ రైతుల పాదయాత్ర సాఫీగా సాగిపోయింది. ఆ పాదయాత్రలో ఉండగానే హైకోర్టు వారికి ఊరటనిచ్చే తీర్పు చెప్పింది. కానీ ప్రభుత్వం పాటించడం డౌట్‌గా ఉంది కాబట్టి ప్రజల మద్దతు కోసం మళ్లీ ఉత్తారంధ్ర వరకూ పాదయాత్ర ప్రారంభించారు. ఇక్కడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వైసీపీ నేతలు మాత్రమే కుట్రపూరిత ప్రకటనలు చేస్తున్నారు. పాదయాత్ర తర్వాత అమరావతికి సంపూర్ణ మద్దతు లభించినట్లవుతుంది. ఇంత వ్యతిరేక ప్రకటనలు చేసిన తర్వాత వైసీపీకి అది పరాభవమే అవుతుంది.