ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. పరేడ్ గ్రౌండ్ లో బహిరంగసభలో మాట్లాడారు. కేసీఆర్కు పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై చాలా ఆరోపణలు చేశారు. నిజానికి ఈ సభలో కేసీఆర్ కూడా పాల్గొనాల్సి ఉంది. ఆయన పాల్గొంటే ఇలాంటి ఆరోపణలు చేసేవారో లేదో తెలియదు కానీ.. ఆయన రాలేదు కాబట్టి మోదీ స్వేచ్చగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. నరేంద్రమోదీ విమర్శలపై బీఆర్ఎస్ పార్టీ నేతలు వెంటనే స్పందించారు. హరీష్ రావు దగ్గర్నుంచి కింది స్థాయి ఎమ్మెల్యే వరకూ స్పందించారు. అయితే ఎవీరు ఎవరు స్పందించినా… పెద్దగా లెక్కలోకి రాదు. కేవలం.. కేసీఆర్ స్పందిస్తేనే హాట్ టాపిక్ అవుతుంది.
గతంలో అమిత్ షా లేదా ప్రధానమంత్రి వచ్చిన పోయిన తర్వాత వెంటనే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి వారు చేసిన ఆరోపణల్ని ఖండించడం కామన్ గా జరిగేది. బీజేపీతో పూర్తిగా శత్రుత్వం వచ్చిన తర్వాత అసలు వెనక్కి తగ్గడం లేదు. గతంలో మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారని తెలిసిన తర్వాత కనీసం మూడు నాలుగు ప్రెస్ మీట్లు పెట్టారు. అయితే ఇప్పుడు మాత్రం కేసీఆర్ ప్రెస్ మీట్లకు దూరంగా ఉన్నారు. ఇటీవల మహారాష్ట్ర నాయకులు బీఆర్ఎస్లో చేరే సమయంలో మోదీని విమర్శించే సమయానికి వీడియో కెమెరాలను ఆపు చేయించారు.
మోదీ చేసినవి చిన్న విమర్శలేం కాదు.. అవినీతి ఆరోపణలు చేశారు. అభివృద్ధి చేయడం లేదన్నారు. వీటికి కేసీఆర్ స్థాయి నేత కౌంటర్ ఇవ్వకపోతే బీఆర్ఎస్ వాయిస్ గట్టిగా ప్రజల్లోకి వెళ్లదన్న వాదన వినిపిస్తుంది. మరి కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారో మరి !