హైదరాబాద్‌లో వ్యాపార వ్యవహారాలు ఎక్కువగా ఉన్న రెండు సంస్థలపై మూడు రోజుల కిందట ఐటీ అధికారులు దాడులు చేసారు. హైదరాబాద్‌తో పాటు బెంగళూరులోనూ ఈ సోదాలు జరిగాయి. దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయల గోల్ మాల్ జరిగినట్లుగా తేల్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్త చాలా మీడియాల్లో కనిపించడం లేదు. ఆ రెండు కంపెనీల పేర్లు నూజివీడు సీడ్స్, దివ్యశ్రీ రియల్ ఎస్టేట్స్. ఈ రెండింటి మధ్య వ్యాపార లావాదేవీల్లో గోల్ మాల్ జరిగిందని ఫిర్యాదులు రావడంతోనే ఐటీ అధికారులు సోదాలు చేసినట్లుగా తెలుస్తోంది.
అయితే్ ఈ ఐటీ దాడులకు రాజకీయ పరిణామాలకు ఏమైనా సంబంధం ఉందా లేదా అన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు . దివ్య శ్రీ రియల్ ఎస్టేట్స్ సంస్థ పెద్దగా ప్రచారం చేసుకోదు. కానీ హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో భారీ భవనాలు నిర్మించింది. బెంగళూరులోనూ పెద్ద ఎత్తున స్థిరాస్తి వ్యాపారం చేస్తుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో చక్రం తిప్పుతున్న బడా వ్యాపారి చేతి సంస్థేనని చెబుతూ ఉంటారు.
నూజివీడ్ సీడ్స్ యజమానికి కూడా అధికార పార్టీలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతూంటారు. ఈ క్రమంలో ఐటీదాడుల అంశం చాలా వరకూ మీడియా గోప్యత పాటించడంతో అంతర్గతంగా ఏదో జరుగుతోందన్న అభిప్రాయం ప్రారంభమయింది. అయితే ఇలాంటి ఐటీ దాడులు గతంలో చాలా జరిగాయని… అంత మాత్రానే ఏదో జరిగిపోతుందని అనుకోవడం వేస్టని తెలంగాణ రాజకీయ వర్గాలు కూడా చెబుతున్నాయి.