వైఎస్ వివేకా హత్య కేసులో దాదాపుగా అందరికీ బెయిల్ వచ్చేసింది. చివరిగా జైల్లో ఉన్న ఉమాశంకర్ రెడ్డికి కూడా బెయిల్ వచ్చింది. అసలు మెయిన్ సూత్రధారిగా సీబీఐ చెబుతున్న అవినాష్ రెడ్డికి అయితే అసలు అరెస్టు కాకుండానే బెయిల్ వచ్చేసింది. అరెస్టు చేస్తే బెయిల్ ఇచ్చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశంతో ఎప్పుడు అరెస్టు చేశారో.. ఎప్పుడు విడుదల చేశారో అంతా అయిపోయిన తర్వాతే తెలిసింది. తర్వాత శివంకర్ రెడ్డి సహా అందరూ బయటకు వచ్చేశారు. కానీ కేసు మాత్రం ఎక్కడిదక్కడే ఆగిపోయింది.
మరో వైపు సీబీఐ అధికారిపై తప్పుడు కేసు పెట్టినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డి దగ్గర నుంచి పోలీసులు మరోసారి వాంగ్మూలం నమోదు చేశారు. ఆయన రామ్ సింగ్ తనను వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అలా చేసే చాన్స్ లేకపోయినా కొంత మంది ప్రోద్భలంతో అలా ఫిర్యాదు చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన మళ్లీ ఏం వాంగ్మూలం ఇచ్చారో స్పష్టత లేదు.
సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు గడువు పెట్టింది. ఆ గడువు వరకూ అయిన దర్యాప్తును సీబీఐ సుప్రీంకోర్టుకు నివేదించింది. అంతే.. కేసు సుప్రీంకోర్టులో ఉండిపోయింది. అత్యంత తీవ్రమైన హత్య కేసులో పక్కా సాక్ష్యాలతో నేర నిరూపణ చేయాల్సిన సీబీఐ అచేతనమైపోయింది. ఎంతగా అంటే… దర్యాప్తు అధికారిపైనే ఎదురు కేసులు పెడితే ఎదుర్కోలేనంత. ఇప్పుడు ఈ కేసులో విచారణ ఎప్పుడు జరుగుతుందో.. ఓ హత్య కేసులో .. అదీ కూడా వీఐపీ హత్య కేసులో వ్యవస్థల నిర్లక్ష్యం సమాజానికి ఏం సందేశం ఇస్తుందో చెప్పడం కష్టం.