నక్సలైట్ నుంచి సంఘవిద్రోహశక్తిగా మారిన నయీం కేసులో పోలీసులు అందరూ అమాయకులేనని.. ఆ డిపార్టుమెంట్ తేల్చింది. ఎందుకంటే.. వారి శాఖలో వచ్చిన వారిపై వచ్చిన ఆరోపణలను వారే విచారణ చేయాల్సి ఉంటుంది. వారే విచారణ చేశారు.. చివరికి పోలీసులు అందరూ అమాయకులేనని.. ఎవరికీ.. నయీంతో సంబంధాలు లేవని సుదీర్ఘ విచారణ తర్వాత తేల్చారు. ఈ మేరకు నయీంతో అంట కాగినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసులు అందరికీ క్లీన్ చిట్ లభించినట్లయింది. అప్పట్లో నయీం ఇళ్లలో దొరికిన డైరీలు.. ఇతర ఆధారాల ఆధారంగా సస్పెన్షన్ వేటుకు గురైన పోలీసు అధికారులకు రిలీఫ్ లభించినట్లయింది.
నయీంతో పోలీసు అధికారుల బంధం బహిరంగం. ఎందుకంటే.. నక్సలైట్ ఉద్యమం నుంచి నయీం లొంగిపోయిన తర్వాత ముందుగా ఆయన సేవలను పోలీసులే ఉపయోగించుకున్నారు. ఆయనను ఇన్ ఫార్మర్గా వాడుకుని నక్సలైట్ల గుట్టుముట్లను కనిపెట్టి అనేక ఎన్ కౌంటర్లు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా నయీం ప్రైవేటు సెటిల్మెంట్లకు దిగారు. పోలీసుల వద్దకు వచ్చిన వివాదాలను కూడా సెటిల్ చేస్తూ.. ఎదిగారు. దొంగ పాస్పోర్టులతో విదేశాలకు కూడా వెళ్లి వచ్చేవారని.. దీనికి పోలీసులు సహకరించేవారని చెప్పేవారు. నయీం ముఠా అరాచకాలు హైదరాబాద్ చుట్టుపక్కల అనేకం. అయితే.. ఎక్కడా .. ఎప్పుడూ నయీం పట్టుబడలేదు. ఎక్కువగా.. షాద్ నగర్, భువనగిరి ప్రాంతాల్లో ఆయన తిరుగుతూ ఉంటాడని తెలిసినా కూడా పోలీసులు పట్టుకోలేదు.
కానీ నయీం చివరికి.. ఓ రాష్ట్రమంత్రిని బెదిరించడంతో ఆయనకు ఎండ్ కార్డ్ వేయాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించడంతో ఎన్ కౌంటర్ జరిగిపోయిది. ఆ సందర్భంగా నెల రోజులకుపైగా బ్రేకింగ్ న్యూసులు వచ్చాయి. వాళ్లతో సంబంధాలు.. వీళ్లతో సంబంధాలు అని చెప్పుకున్నారు. చివరికి కొన్ని పార్టీ ఫిరాయింపులు కూడా జరిగాయి. ఇప్పుడు.. పోలీసులపై వచ్చిన ఆరోపణలన్నీ ఉత్తుతునే అని తేల్చారు. తర్వాత రాజకీయ నేతలపైనా అదే రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. చివరికి నయీం కేసు ఎటూ కాకుండా పోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కొసమెరుపేమిటంటే.. నయీం దగ్గర సోదాల్లో బయటపడిన సొత్తు.. ఇతర ఆస్తులు కూడా రాను రాను చిక్కిపోతూండటం…! చివరికి అవి కూడా నామమాత్రమే అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదేమో..?