వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపి అవినాష్ రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులందరూ నిండా మునిగిపోయినట్లుగా కనిపిస్తోంది. సీబీఐకి వాంగ్మూలం ఇస్తున్న ప్రతి ఒక్కరూ వివేకా హత్య జరిగిన రోజున ఏం జరిగిందో వివరించారు. ఇటీవల దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పిన అంశాలు వైఎస్ అవినాష్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా అనుమానించేలా చేయగా.., అప్పట్లో పులివెందులలో ఉన్న పోలీసు అధికారులు ఇచ్చిన వాంగ్మూలం మరింత సంచలనంగా మారింది.
ఆధారాలు తుడిచేసి బెదిరించారని అప్పటి పులివెందుల సీఐ వాంగ్మూలం!
వివేకా హత్య జరిగిన సమయంలో పులివెందుల సీఐగా శంకరయ్య ఉన్నారు. ఆయన సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో … వైఎస్ అవినాష్ రెడ్డి ఫోన్ చేసి వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని కేసు వద్దని అవినాష్ రెడ్డి అన్నారని తెలిపారు. వై.ఎస్.అవినాష్‌రెడ్డి, వై.ఎస్.భాస్కర్‌రెడ్డి, వై.ఎస్.మనోహర్‌రెడ్డిలు ఆధారాలు తుడిచేశారన్నారు. ఇంటి తలుపులు వేసి గాయాలకు కట్లు, బ్యాండేజీలు వేసే సిబ్బందినే అనుమతించారు. సాక్ష్యాలు తుడిచేస్తూంటే వారించానన్నారు. మొత్తాన్ని వీడియో తీస్తూంటే ఆపేయాలని దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి బెదిరించారన్నారు. మొత్తంగా అప్పుడేం జరిగిందో సీఐ స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చారు .అయితే సీఐ ఇచ్చిన వాంగ్మూలం ఇప్పటిది 2020 జులై 28న సీబీఐ అధికారుల ఎదుట ఈ వివరాలు చెప్పారు. తాజాగా వెలుగు చూసింది.
ఉదయ్‌కుమార్ రెడ్డిపై డీఎస్పీ అనుమానం !
అప్పటి పులివెందుల డీఎస్పీగా పని చేసిన రెడ్డివారి వాసుదేవన్ సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. వివేకా హత్య జరిగిన రోజున ఉదయ్‌కుమార్‌రెడ్డి వివేకా ఇంటి సమీపంలో ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించామన్నారు. వివేకా హత్య జరిగిన రోజు వేకువజామున 4.38 నుంచి 4.48 మధ్య ఓ వ్యక్తి పులివెందులలోని బ్రిడ్జిస్టోన్ టైర్ల దుకాణం సమీపంలో ద్విచక్రవాహనంపై పదే పదే తిరుగుతూ ఉన్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో నమోదయ్యాయని ఆయన సీబీఐకి చెప్పారు. సీఐ శంకరయ్య చెప్పిందే డీఎస్పీ కూడా చెప్పారు.
దస్తగిరిని ప్రలోభపెట్టి మరింతగా కూరుకుపోయిన అవినాష్ రెడ్డి !
దస్తగిరిని ప్రలోభపెట్టిన వైసీపీ నేతలు మరింతగా ఇబ్బందుల్లో పడినట్లుగా కనిపిస్తోంది. దస్తగిరి ఈ విషయాన్ని సీబీఐకి చెప్పడంతో వారు మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే అవినాష్ రెడ్డితో పాటు ఆయన ఫ్యామిలీ వైఎన్ వివేకా హత్య కేసులో తేలుకోలేని విధంగా ఇరుక్కుపోయినట్లుగా కనిపిస్తోంది. వీరి ఆరెస్టులు ఏ క్షణమైనా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది.