ఎర్రబెల్లి దయాకరరావు తెలుగుదేశం అధినేతకు సన్నిహితుడుగా వుంటూనే తెలంగాణ సమీకరణాల్లో విచిత్రమైన పాత్ర పోషిస్తూ వచ్చారు. ఆయన చాలా కాలంగా టిఆర్ఎస్లో చేరడానికి ప్రయత్నిస్తూనే వున్నట్టు చెప్పడానికి రకరకాల కథనాలున్నాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా తను వెళ్లబోతున్నట్టు వార్తలు రావడం తర్వాత సర్దుకోవడం పరిపాటిగా వుండేది. ఆ రోజుల్లో చాలాసార్లు సన్నిహితంగా మాట్లాడేవాణ్ని. మిగిలిన వారు ఉద్రేకపడినప్పుడు కాస్త సర్దిచెప్పే పాత్ర పోషించారు. ఎర్రబెల్లిని అట్టిపెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యలపైనా చాలా కథలున్నాయి. శాసనమండలి సభ్యులొకరు చెప్పిన కథ వాటిలో ఆసక్తికరమైంది. తను టిఆర్ఎస్లో చేరేందుకు సహకరించవలసిందిగా ఎర్రబెల్లి కెసిఆర్‌కు సన్నిహితంగా వుండే ఒక అగ్రశ్రేణి వాణిజ్యవేత్తను కోరారట. ఆ విషయం చంద్రబాబుకు తెలిసి ఆ వాణిజ్యవేత్తపై నిప్పులు కక్కారట. ఆ పైన సదరు వాణిజ్యవేత్త ఎర్రబెల్లిని బాగా దూరం పెట్టారట. కాగా మరో కథ కడియం శ్రీహరికి సంబంధించింది. వరంగల్‌లో వారిద్దరూ ఉప్పు నిప్పులా వుంటారు. ఆయన టిఆర్ఎస్లో చేరి మంత్రి కాకుండా తను అడ్డుపడ్డానని ఎర్రబెల్లి పొరబడుతున్నారని ఆయనే ఒక సారి చెప్పినట్టు సమాచారం. కాగా ఒకసారి ఎర్రబెల్లి స్వయంగా సిఎం కెసిఆర్‌ను కలుసుకోవడానికి వెళితే ఆయన ప్రధాన ప్రత్యర్థి రహస్యంగా షూట్ చేసి ఛానళ్లకు పంపించారు. దాంతో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించేందుకు వెళ్లానంటూ వివరణ ఇచ్చారు. శాసనసభలో రాజకీయంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా రేవంత్ రెడ్డి ధోరణి బాగా లేదని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ఘర్షణ పడ్డారు కూడా. అధినేత ఆయన కుమారుడు లోకేష్‌లు ప్రాధాన్యతనివ్వకపోవడం వీటికి తోడైంది. బహుశా ఈ సందేహాస్పద పరిస్థితివల్లనే వారు దూరం పెట్టివుండే అవకాశం వుంది. ఎట్టకేలకు ఈ అధ్యాయం ముగించి ఇప్పుడు టిఆర్ఎస్ తీర్థం పుచ్చేసుకున్నారు.తధాస్తు.