దేశంలో ఉన్న అన్ని వృత్తుల్లోకి పరమ రొటీన్ వ్యవహారం అంటే రాజకీయ నాయకులదేనేమో. ప్రతిపక్షంలో ఉన్నా, పోటీ చేసే సమయంలోనూ, గెలిచిన తర్వాత, ఓడిన తర్వాత, ఓదార్పు యాత్రల్లో…సిచ్యుయేషన్ ఏదైనా సరే…నాయకుల రియాక్షన్ మాత్రం పరమ రొటీన్‌గా ఉంటుంది. మాటలు అయితే ఇంకా రొటీన్‌గా ఉంటాయి. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలు కూడా ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి. ఇక భజన వ్యవహారాలయితే చెప్పనవసరం లేదు. యాభై అరవైఏళ్ళుగా ప్రజలకు పిచ్చ బోర్ కొట్టించేస్తున్నారు. కానీ నాయకులకు మాత్రం అస్సలు బోర్ కొడుతున్నట్టుగా లేదు. లేకపోతే మనుషులెవ్వరికీ లేనంత జడత్వం మన నాయకులకు ఉందేమో మరి. అందుకే కొత్తగా ఏమీ ప్రయత్నం చేయరు. దేశంలో ఉన్న అన్ని పార్టీలు, అందరు నాయకులదీ అదే తంతు. ఎన్నికల్లో గెలిస్తే…మా అంతటోడు లేడు అని చెప్పుకుంటారు. ప్రజలందరూ కూడా మాకే మద్ధతు పలికారు అని చెప్తారు. తీరా చూస్తే 40 శాతం అటూ ఇటూగా గెలిచినోడి మెజార్టీ ఉంటుంది. ఇక ఓడినా కూడా మనవాళ్ళు అంతే రొటీన్‌గా స్పందిస్తూ ఉంటారు.
ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపణలు చేస్తూ ఉంటారు. గతంలో అయితే రిగ్గింగులు చేశారని, రౌడీయిజం చేశారని, దొంగ ఓట్లు గుద్దారని విమర్శలు చేసేవారు. ఇప్పుడు టెక్నాలజీ మారింది కదా. అందుకే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని విమర్శిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బిజెపి సాధించిన ఘనవిజయం కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ వళ్ళే సాధ్యమైందని బిఎస్పీ అధినేత్రి మాయావతి తాజాగా సెలవిచ్చారు. దమ్ముంటే బ్యాలెట్ పేపర్‌తో ఓటింగ్‌కి సిద్ధం కావాలని సవాల్ కూడా విసిరారు. అయినా ఓటమి బాధలో మాయావతి అయోమయానికి గురవుతున్నారు కానీ ఈ డైలాగులన్నీ అఖిలేష్ యాదవ్ చెప్పాల్సినవి. ఎందుకంటే సెకండ్ వచ్చినది ఆయనే మరి. ఒకవేళ బిజెపి తప్పు చేసి ఉంటే అఖిలేష్ యాదవ్ ఫీలవ్వాలి. కానీ మాయావతి ఫీలవ్వడంలో ఏమైనా అర్థం ఉందా? బ్యాలెట్ పేపర్‌తో ఓటింగ్ పెడితే చించేస్తానని చెప్పి మాయావతి చెప్పుకోవచ్చు కానీ…అప్పుడు మాత్రం ఆమెకు మెజారిటీ ఎలా వస్తుంది? ఈమెకంటే ముందు అఖిలేష్ ఉన్నాడుగా. వచ్చే ఎన్నికల నాటికి ఉత్తరప్రదేశ్‌లో అసలు బిఎస్పీ పార్టీనే ఉండదని, బిజెపి, ఎస్పీలు మాత్రమే ఉంటాయని విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో మాయా దీదీకి మైండ్ బ్లాంక్ అయినట్టుంది. అందుకే అఖిలేష్ చేయాల్సిన విమర్శలు తానే చేసేస్తోంది. ఇక తన ఐరన్ లెగ్‌తో అఖిలేష్‌ని కూడా ముంచిన పొలిటికల్ ఉత్తరకుమారుడు రాహుల్గాంధీవారు బిజెపి గెలుపును ఎలా విశ్లేషిస్తారో చూడాలి. ట్విట్టర్ జనాలందరూ ఆయన స్పందన కోసం వెయిటింగ్ మరి. తెలుగు జనాలయితే సినిమాలో బ్రహ్మానందం ఎంట్రీ కోసం వెయిట్ చేసినట్టుగా వెయిట్ చేస్తున్నారు.