‘శివ’ తరవాత అసిస్టెంట్ డైరెక్టర్లకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. హైదరాబాద్ లో అడుగు పెడితే.. రాంగోపాల్ వర్మ దగ్గరే శిష్యరికం చేయాలని ఆయన ఆఫీసు గేటు ముందు పడిగాపులు కాచేవారు. వర్మ అసిస్టెంట్ అంటే… వాళ్లకు దర్శకత్వ అవకాశాలు మెరుగ్గా ఉండేవి. ఆ తరవాత అంతటి ఫాలోయింగ్ ఈవీవీ సత్యనారాయణ దగ్గరే. అయితే ఈయన దగ్గర రైటర్లకు డిమాండ్. ఈవీవీ దగ్గర కనీసం డజను మంది రచయితలు ఉండేవారు. ఒకొక్కరితో ఒక్కో వెర్షన్ రాయించి, వాటన్నింటినీ కలిపి తానో వెర్షన్ ఫిక్స్ చేసేవారు ఈవీవీ. ‘నేను రైటర్నిసార్’ అని ఎవరైనా ఈవీవీ దగ్గరకు వెళ్తే, పని ఉన్నా, లేకున్నా వాళ్లకు ఈవీవీ ఆఫీసులో చోటు గ్యారెంటీ. అందుకే రైటర్లంతా ఈవీవీ గేటు ముందు పడిగాపులు కాచేవారు. ఆ జాబితాలో త్రివిక్రమ్ పేరు కూడా ఉంటుంది.
త్రివిక్రమ్ హైదరాబాద్ వచ్చిన కొత్తలో చేసిన తొలి పని.. ఈవీవీ ఆఫీసు వెదుక్కొంటూ రావడం. ప్రతీరోజూ ఫిల్మ్ నగర్‌లోని ఈవీవీ ఆఫీసుకి వెళ్లడం, ఈవీవీ పిలుపు కోసం వేచి చూడడం ఇదే త్రివిక్రమ్ దినచర్య. ఓరోజు కారులో వెళ్తూ.. వెళ్తూ త్రివిక్రమ్‌ని గమనించి దగ్గరకు పిలిచార్ట. ‘ఎక్కడి నుంచి వచ్చావ్, ఏం చదువుకొన్నావ్` అని అడిగి తెలుసుకొన్నార్ట. త్రివిక్రమ్ క్వాలిఫికేషన్ ఏంటో తెలిశాక.. `ఇంత చదువుకొని.. ఇలా ఒకరి కోసం వెయిట్ చేయడం బాగోదు.. మంచి పని చేసుకో..’ అని సలహా ఇచ్చార్ట. అప్పటి నుంచి.. త్రివిక్రమ్ ఏ ఆఫీసు గేటు ముందూ నిలబడలేదు. తన కాళ్లపై తాను నిలబడి, రచయితగా అంచెలంచెలుగా ఎదిగి, సూపర్ డూపర్ స్టార్ రైటర్ అయ్యారు. ఇప్పుడు సౌత్ లోనే టాప్ 5 దర్శకులలో ఆయన ఒకరు. పోసాని కృష్ణమురళి దగ్గర శిష్యరికం చేసినా అదంతా అనుకోకుండా జరిగినదే. పోసాని దగ్గర పని చేసినా.. ఆయన రాసిన డైలాగులు పోసాని స్టైల్లోనే సాగేవి. ‘స్వయంవరం’తో తన ఛమక్ తొలిసారి చూపించిన త్రివిక్రమ్ ఆ తరవాత వెనుదిరిగి చూసుకోలేదు.