తెలంగాణ సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అగ్రవర్ణ పేదలకు కేంద్రం కల్పించిన రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయించారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. ఇప్పటికే తెలంగాణలో బలహీన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్‌తో కలిపి రిజర్వేషన్లు 60 శాతానికి చేరుతాయి. రెండు రోజుల్లో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష తర్వాత ఆదేశాలు జారీ అవుతాయని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చాయి. గత ఎన్నికలకు ముందు.. అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్రాల్లో అమలు చేయాలంటే.. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
బీజేపీ పాలిత రాష్ట్రాలు వీటిలో కొన్ని కొన్ని మార్పులు చేసుకుని అమలు చేశాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. పది శాతంలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తూ.. మిగిలిన ఐదు శాతం ఇతర కులాల అగ్రవర్ణాలకు కేటాయించారు. అయితే జగన్మోహన్ రెడ్డి సర్కార్ రాగానే.. ఆ ఐదు శాతం రద్దు చేశారు. అదే సమయంలో… పది శాతం అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కూడా అమలు చేయడం లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ అసలు ఎప్పుడూ అమలు చేయాలని అనుకోలేదు. కేంద్ర పథకాలేమీ అమలు చేయడం లేదు.
ఈ అంశంపై బీజేపీ నేతలు విమర్శలు కూడా చేసేవారు. కానీ గ్రేటర్ ఎన్నికల తర్వాత పరిస్థితి మారింది. కేంద్రం పథకాలను అన్నింటినీ అమలు చేయడానికి నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ చట్టాలకు మద్దతుగా మాట్లాడుతున్నారు. వద్దే వద్దని ప్రకటించిన ఆయుష్మాన్ భవ పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు. ఇప్పుడు అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లు కూడా అమలు చేస్తున్నారు. కేసీఆర్ నిర్ణయం సంచలనాత్మకం అయింది.