గత ఏడాది కన్నడలో శాకాహారి అనే ఓ సినిమా వచ్చింది. ఆ రాష్ట్రంలో సూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో ఓ హోటల్ నడుపుకునే పెద్దాయన ఓ వ్యక్తిని హత్య చేస్తాడు. అతన్ని ముక్కలుగా నరుకుతాడు. కాల్చేస్తాడు. ఎముకల్ని పిండి చేసి దూరంగా పడేస్తాడు. చనిపోయిన వ్యక్తి ఆ ఇంట్లోకి వచ్చినట్లుగా సీసీ కెమెరాలు రికార్డు చేశాయి. కానీ బయటకు వెళ్లినట్లుగా రికార్డు కాలేదు. చంపేశాడని పోలీసులకు అర్థమయింది.కానీ ఆధారాలు ఎలా సేకరించాలో వారికి అర్థం కాదు.. ఆ తర్వాత సినిమా కథ వేరేగా ఉంటుంది.. కానీ హైదరాబాద్లోని మీర్ పేట జిల్లాల గూడలో జరిగిన హత్య కూడా సేమ్ స్టోరీలాగానే ఉంది.
గురుమూర్తి అనే వ్యక్తి సంక్రాంతి రోజున తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు . పోలీసులు మొత్తం సీసీ ఫుటేజీ చూస్తే ఆయన భార్య ఇంట్లోకి పోవడం రికార్డు అయింది. మళ్లీ బయటకు రాలేదు. దాంతో గురుమూర్తిని నాలుగు పీకడంతో మొత్తం చెప్పేశాడు. అనుమానంతో భార్య మాధవని చంపేశానని చెప్పాడు. మరి మృతదేశం ఏది అంటే.. ముక్కలుగా నరికానని.. ఉడకబెట్టానని.. ఎముకల్ని విడిగా తీసి పిండిగా చేసి పడేశానని చెప్పాడు. అతను చెప్పిన వివరాలతో పోలీసులకు మైండ్ బ్లాంక్ అయింది. అరెస్టు చేశారు కానీ.. ఆ ఎముకల పొడిని.. ముక్కలు చేసి ఉడకబెట్టి పడేసిన శరీర భాగాల్ని కనిపెట్టడం వారి వల్ల కావడం లేదు.
నోటి మాటగా గురుమూర్తి చెప్పిన మాటలకు ఆధారాల కోసం పోలీసులు వెదుకుతున్నారు. కానీ దొరకడం లేదు. గురుమూర్తి కూడా.. రికార్డెడ్ గా అలాంటి మాటలు చెప్పమంటే చెప్పడం లేదు. తన భార్యను తాను ఏమీ చేయలేదని.. తాను హత్య చేసినట్లుగా సాక్ష్యాలేవని అంటున్నాడు. దీంతో మీర్ పేట పోలీసులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. పక్కాగా చంపేసి ఆధారాల్లేకుండా చేశాడు. మరి అతన్ని వదిలేయాల్సి వస్తుందా ?