ఆంధ్రప్రదేశ్ కి కొత్త గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీలో ఆయన రాకకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈనెల 24న ఆయన కొత్త గవర్నర్ గా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణం చేయిస్తారు. ప్రమాణ స్వీకారానికి రెండ్రోజులు ముందే బిశ్వభూషణ్ తిరుపతి వెళ్తారు. 23న అక్కడ స్వామివారిని దర్శించుకుని, విజయవాడ చేరుకుంటారు. ఆ మర్నాడు ప్రమాణ స్వీకారం. దీంతో, ఇప్పుడు ఏపీలో కొత్త రాజ్ భవన్ కి ఏ భవనం కేటాయించాలా అనే అంశమ్మీద ఇప్పటికే ఏపీ ప్రభుత్వం క్లారిటీకి వచ్చేసింది.
విజయవాడ బందర్ రోడ్డులోని పాత ఇరిగేషన్ కార్యాలయల భవనాన్ని రాజ్ భవన్ గా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. గవర్నర్ నివాసం కోసం మొదట రెండు భవనాలను అధికారులు, భద్రతా సిబ్బంది పరిశీలించారు. అయితే, బందర్ రోడ్డులో ఉన్న ఈ భవనం ప్రస్తుతానికి సరిపోతుందనే నివేదికను సీఎస్ కు అధికారులు ఇచ్చారు. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చర్చించిన అనంతరం నోటిఫికేషన్ విడుదల అయింది. నిజానికి, 2015లో హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి నాటి సీఎం చంద్రబాబు నాయుడు నివాసం మార్చారు కదా! అప్పుడు ముఖ్యమంత్రి తొలిగా ఇక్కడి నుంచే కార్యకలాపాలు ప్రారంభించారు. అప్పటికి అరకొర సౌకర్యాలే ఈ భవనంలోఉండేవి. ఆ సమయంలోనే ఈ భవనాన్ని రీమోడల్ చేశారు. భారీ ఎత్తున ఖర్చుతో రెండు ఫ్లోర్లనూ ఆధునీకరించారు. కాబట్టి, ఇప్పుడు కొత్తగా ప్రత్యేకంగా ఎలాంటి మార్పులూ చేర్పులూ చేపట్టాల్సిన అవసరం లేదని అంటున్నారు. అందుకే, ఇదే భవనాన్ని గవర్నర్ కార్యాలయంగాను, దీంతోపాటు అధికారిక నివాసంగానూ ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రస్తుతం రాజ్ భవన్ లో ఉన్న సిబ్బందిని ఏపీకి వెంటనే తరలించేలా, ఇదే భవనంలో సిబ్బందికీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం గిరిజన సంక్షేమ కార్యదర్శిగా ఉన్న ముఖేష్ కుమార్ మీనాని గవర్నర్ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో రెండ్రోజుల్లో… అంటే, ఆదివారం నాటికి రాజ్ భవన్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లూ పూర్తయిపోతాయనీ, ప్రస్తుతానికి ఇక్కడున్న కార్యాలయం సరిపోతుందని చెప్పారు ముఖేష్ కుమార్. గవర్నర్ అధికారిక నివాసాన్ని ఎక్కడ కేటాయిస్తారు అనే చర్చకు తెరపడింది.