తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్కు చెందిన వారి డబ్బులు పైసా కూడా పట్టుబడలేదు. కానీ ప్రత్యర్థులవి మాత్రం కోట్లకు కోట్లు పట్టబడ్డాయి. ఇటీవలి ఎన్నికల్లో ఔటర్ రింగ్ రోడ్ పై ఆరున్నర కోట్లు పట్టుకున్నారు. అవి పొంగులేటివన్న ప్రచారం ఉంది. ఇలాంటి కోట్లు ఎన్ని పట్టుకున్నారో లెక్కలేదు. చివరికి 2019లో ఏపీ ఎన్నికల సమయంలో టీడీపీ నేతల ఆర్థిక మూలాలను కూడా కట్టడి చేశారు.
జయభేరి గ్రూప్ ఉద్యోగులు రైల్లో సామాన్యుల్లా డబ్బులు తీసుకెళ్తూంటే టాస్క్ ఫోర్స్ పట్టేసుకుంది. రాజమండ్రిలో పోటీ చేస్తున్న మురళీమోహన్ కోడలిపై కేసులు కూడా పెట్టారు. కానీ వైసీపీ నేతలకు మాత్రం విచ్చలవిడిగా డబ్బులు బట్వాడా అయ్యాయి. ఇక బీఆర్ఎస్ డబ్బులు ఎందుకు పట్టబడలేదంటే.. ఆ డబ్బుల్ని.. పోలీసులే బట్వాడా చేశారు. రాధాకిషన్ రావు స్వయంగా ఈ విషయాన్ని పోలీసులకు చెప్పినట్లు రిమాండ్ రిపోర్టు వెల్లడించింది.
ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చెప్పినట్లు చేశాం. నల్లగొండ నుంచి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావును తీసుకున్నాం. హైదరాబాద్ లో తిరుపతన్న, రాచకొండ నుంచి భుజంగరావు, సైబరాబాద్ నుంచి వేణుగోపాల్ రావు లను నియమించుకుని ట్యాపింగ్ ద్వారా వివరాలు సేకరించి డబ్బుల దందా చేపట్టినట్లుగా రాధాకిషన్ రావు అంగీకరించారు. టాస్క్ ఫోర్స్ వాహనాల్లో బీఆర్ఎస్ డబ్బులు డెలివరీ చేసినట్లుగా అంగీకరించారు. బీఆర్ఎస్ సుప్రీం బాస్ ఆదేశాలతో ప్రతిపక్ష పార్టీల ఫోన్లు ట్యాపింగ్ చేశాం. బీఆర్ఎస్ లోని కొందరి నాయకుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశామని అంగీకరించారు.