కడపలో దందాలు చేసి.. సైలెంటుగా ముంబై ఎయిర్ పోర్టు నుంచి దేశం విడిచి పారిపోదామనుకున్న మాజీ ఉపముఖ్యమంత్రి అంజాద్ భాషా సోదరుడు పప్పులు ఉడకలేదు. ఆయనపై లుకౌట్ నోటీసులు ఉండటంతో ఎయిర్ పోర్టులోనే పోలీసులు అదుపులోకి తీసుకుని కడప పోలీసులకు అప్పగించారు. ఆయన కువైట్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కడపకు దగ్గర చెన్నై ఎయిర్ పోర్టు ఉంది…కాదంటే హైదరాబాద్ నుంచి పోవచ్చు. కానీ ముంబై నుంచి పోవడానికి .. పోలీసుల కళ్లు గప్పి పోవాలనుకోవడమే. కానీ లుకౌట్ నోటీసులు ఉంటే ఏ ఎయిర్ పోర్టులో అయినా పట్టుకుంటారని ఆయనకు అహ్మద్ బాషాకు ఇప్పుడు తెలిసి వచ్చి ఉంటుంది.
అంజాద్ బాషా అధికారంలో ఉన్నప్పుడు.. ఆయన కుటుంబసభ్యులు చేసిన దందాలు అన్నీ ఇన్నీ కావు. ఆయన ఓటమికి ఇదే ప్రధాన కారణం. వారిలో అహ్మద్ బాషా చేసిన దందాలు మరో లెక్క. కబ్జాలు, సెటిల్మెంట్లు చేశారు. దీనిపై కూటమి ప్రభుత్వం వచ్చాక పలు కేసులు నమోదయ్యాయి. ఓ స్థలం విషయంలో యజమానులపై దాడులు చేశారు. ఎమ్మెల్యే మాధవీరెడ్డి, టీడీపీ కడప అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిలపై అనుచితంగా మాట్లాడేవారు. ఈ క్రమంలో ఆయనపై చాలా కేసులు నమోదయ్యాయి. దీంతో పారిపోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.
పోలీసులు అహ్మద్ బాషా ప్లాన్ ను గుర్తించి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇలా జారీ చేశారని తెలియక ఆయన ముంబై ఎయిర్ పోర్టు నుంచి పారిపోవాలనుకున్నారు. కానీ దొరికిపోయారు. కడప పోలీసులు ఆయనను తీసుకు వచ్చి కడప కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. నేరాలు చేసిన వారిని అప్పటికప్పుడు అరెస్టు చేయకపోయినా.. వారు దేశం దాటి పోకుండా లుకౌట్ నోటీసులు మాత్రం జారీ చేసి జాగ్రత్త పడుతున్నారు పోలీసులు.