ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీప నండూరి సాంబశివరావు వైసీపీ అధినేత జగన్ తో సమావేశమయ్యారు. విశాఖ జిల్లా రాంబిల్లిలో తన పాదయాత్ర బసలో ఉన్న జగన్ తో … నండూరి సాంబశివరావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయన వైసీపీలో చేరినట్లు.. ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. జగన్ తో భేటీ తర్వాత సాంబశివరావు ఏమీ మాట్లాడకపోయినప్పటికీ.. విజయసాయిరెడ్డి మాత్రం… పార్టీలో చేరినట్లు ప్రకటించేశారు. ఆయన చేరికతో వైసీపీ బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
సాంబశివరావు డీజీపీగా ఉన్నప్పుడు..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ఆరోపణలు చేసింది. ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా మండి పడింది. వైసీపీ ఎమ్మెల్యే రోజా అయితే.. సాంబశివరావుపై నేరుగా ఓ ప్రైవేటు కేసు కూడా దాఖలు చేశారు. మహిళా సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన రోజాను పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ లో విడిచిపెట్టారు. దానిపై ప్రైవేటు కేసు వేయడమే కాకుండా.. రోజా తన మార్క్ విమర్శలు కూడా చేశారు. నిజానికి సాంబశివరావు డీజీపీగా ఉన్నప్పుడే.. ఆయన పదవి విరమణ తర్వాత రాజకీయాల్లోకి వస్తారని… ఆయన టీడీపీలో చేరుతారని.. జగన్ మీడియాలోనే విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ వార్తలను సాంబశివరావు కూడా అప్పట్లో ఖండించేదు కానీ… పదవి విరమణ తర్వాత నిర్ణయం తీసుకుంటానన్నారు. అయితే హఠాత్తుగా వైసీపీ అధినేతను కలిసి సంచలనం రేపారు.
పదవి కాలంలో టీడీపీ అధినేతతో సన్నిహితంగా ఉండి… ఆ తర్వాత వ్యతిరేకంగా మారుతున్న బ్యూరోక్రాట్ల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. మాజీ సీఎస్ లు … ఐవైఆర్ కృష్ణారావు, అజేయ కల్లాం ఇప్పటికే విమర్శులు చేస్తున్నారు. అయితే మాజీ డీజీపీ… చంద్రబాబుకు దూరమవడం వెనుక ఉన్న కారణాలు.. వ్యక్తిగతమని ప్రచారం జరుగుతోంది. సాంబశివరావు అల్లుడు… ఇటీవల ఆయన కుమార్తెకు విడాకులు ఇచ్చారు. ఆయన వెళ్లి మంత్రి అఖిలప్రియను వివాహం చేసుకుంటున్నారు. తన కుమార్తె కాపురాన్ని నిలబెట్టే విషయంలో…చంద్రబాబు నుంచి సహకారం అందలేదని.. సాంబశివరావు ఫీలవుతున్నారని.. అందుకే.. దూరమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నెల 29న సాంబశివరావు మాజీ అల్లుడితో అఖిలప్రియ పెళ్లి జరగబోతోంది. దానికి కౌంటర్ గానే సాంబశివరావు… జగన్ ను కలిసినట్లు చెబుతున్నారు.