వైసీపీకి గట్టి షాక్ తగిలింది. మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ పార్టీకి రాజీనామా చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఈ రాజీనామా వైసీపీ అధినేత జగన్ కు ఊహించని షాక్ లాంటిదే. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేను కూడా కాదని అప్పటికప్పుడు ఆయనతో వీఆర్ఎస్ ఇప్పించి మరీ టిక్కెట్ ఇచ్చారు. కానీ ఆయన ఓడిపోయారు. ఇప్పుడు నేరుగా పార్టీకే గుడ్ బై చెప్పారు.
ఇంతియాజ్ అహ్మద్ కన్ఫర్డ్ ఐఏఎస్. మొదటి నుంచి వైస్ కుటుంబానికి దగ్గర. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఎక్కడా లేనంత ప్రాధాన్యం లభించింది. పలు కీలక జిల్లాలకు కలెక్టర్ గా చేశారు. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని ఆసక్తి వ్యక్తం చేయగానే ఆయనకు టిక్కెట్ ఇవ్వాల్సిందేనని జగన్ అనుకున్నారు. ఆ ప్రకారం మొదట కర్నూలు లేదా నంద్యాల ఎంపీ టిక్కెట్లు ఇద్దామనుకున్నారు. చివరికి కర్నూలు అసెంబ్లీ సీటును ఖరారు చేశారు.
కర్నూలులో అప్పటికే వైసీపీలో రెండు వర్గాలు ఉన్నాయి. ఎస్వీ మోహన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వర్గాలున్నాయి. ఈ రెండు వర్గాలకు టిక్కెట్ రాకపోవడంతో ఎవరూ పని చేయలేదు.దాంతో ఆయన ఘోరంగా ఓడిపోయారు. అయినా ఎన్నికల తర్వాత ఆయనకు రాజకీయంగా సహకారం లభించకపోవడం, జగన్ కూడా పట్టించుకోకపోవడంతో పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక రాజకీయాల్లో ఉండనని ఆయన చెబుతున్నారు.