మాజీ ఎస్ఐబి డిఎస్పి ప్రణీత్ రావు కేసు ను ప్రభుత్వం సిట్‌కు అప్పగిం చింది. జూబ్లీహిల్స్ ఎసిపిని విచారణ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ప్రణీత్ రావు పలువురి ఫోన్లను ట్యాపింగ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. గతంలో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఈ విషయమై ఆరోపణలు చేశారు. బిజెపి నేతలతో పాటు గవర్నర్ కూడా తమ ఫోన్లు ట్యాపింగ్‌కు గురౌతున్నాయనే అనుమానాలు వ్యక్తం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన డేటాను ప్రణీత్‌రావు ధ్వంసం చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుండి ఇప్పటివరకు దర్యాప్తు వివరాలను సిట్ బృందం తీసుకోనుంది. ఇక నుండి సిట్ బృందం ప్రణీత్ రావును విచారించనుంది. ఆధారాలు ద్వంసం చేయాలనే ఆదేశాలను ప్రణీత్‌రావుకు ఎవరు ఇచ్చారన్న దానిపైనా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలోనే ప్రణీత్ రావు అన్నీ చేశారని ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రభాకర్ రావు రిటైరైనా పదవి కాలం పొడిగింపు పొందారు. కాంగ్రెస్ గెలవగానే రాజీనామా చేసి వెళ్లిపోయారు.
ప్రణీత్ రావు కు వచ్చిన ప్రమోషన్.. ఇచ్చిన విధానంపైనా ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రణీత్ రావు అడ్డదారిలో ప్రమోషన్ పొందారని ఓ పోలీసు అధికారి ఫిర్యాదు చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖలో దొడ్డిదారిన యాక్సిలరేటెడ్ ప్రమోషన్ పొందిన నలుగురు అధికారుల్లో ప్రణీత్ కూడా ఉన్నారంటూ ప్రభుత్వానికి గంగాధర్ అనే డీఎస్పీ ఫిర్యాదు చేశారు. ఈ అధికారుల ప్రమోషన్లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. మావోయిస్టులతో ముడిపడిన ఆపరేషన్స్‌లో చురుకుగా వ్యవహరించిన అధికారులకు గతంలో యాక్సిలరేటెడ్ ప్రమోషన్లు ఇచ్చేవారని గుర్తుచేశారు. అయితే ప్రణీత్ రావు ఎలాంటి నక్సలైట్ సంబంధిత ఆపరేషన్ చేయకుండానే డీఎస్పిగా ప్రమోషన్ ఇచ్చారని ఫిర్యాదులో ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం విచారణ చేయనుంది.