మాజీ సీబీఐ జేడీ లక్ష్మినారాయణ రాజకీయాల్లోకి వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తిరుపతిలో ఆయన పీపుల్స్ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఏపీలోని 13 జిల్లాల్లో గ్రామాల్లో పర్యటించి ప్రజల నుంచి సేకరించిన సూచనలతో రూపొందించిన పీపుల్ మానిఫేస్టోను ఆయన రూపొందించారు. ప్రతిగ్రామంలో ఒక వ్యవసాయ అధికారి ఉండాలనేవి మేనిఫెస్టోలో ప్రధాన అంశాలు. జిల్లాకు ప్రత్యేక వ్యవసాయవిధానం వుండాలని త్వరలో ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక వ్యవసాయ విధానాన్ని విడుదల చేయనున్నట్టు తెలిపారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు , మార్కట్ యార్డ్ లు, చేనేత బోర్డ్ , చేనేత పాలసీ, మాత్య కారులకు పాలసీ , విద్య వైద్య విధానాల్లో గ్రామీణ అవసరాలకు తగ్గట్టు నూతన విధానాలు, యువతరాన్ని వ్యావసాయం లోకి రప్పించేందుకు తగ్గట్టు వ్యవసాయ కంపెనీ ఏర్పాటు వంటివి లక్ష్మినారాయణ పీపుల్స్ మేనిఫెస్టోలో ఉన్నాయి.
రుణ మాఫీని విడతల వారీగా చేయడం వల్ల రైతులకు ఉపయోగం లేదని లక్ష్మినారాయణ ప్రకటించారు. స్వామినాథన్ సూచనలు అమలు ముఖ్యమన్నారు. పీపుల్స్ మేనిఫేస్టోలోని పలు అంశాలను ఎన్.జి.ఓ ఏర్పాటు చేయటం ద్వారా సాధించటం సాధ్యం కాదు కాబట్టి… ప్రభుత్వాన్నే ఓ ఎన్.జి.ఓలా పని చేయించటానికి తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. డబ్బు, కులం ప్రమేయం లేకుండా… అవినీతి లేని, ఉపాధికల్పించే లక్ష్యంతో తాను ప్రతిపాదించిన ఈ ప్రతిపాదనలను అంగీకరించి తనతో కలిసి పని చేయటానికి ముందుకు వచ్చే పార్టీలతో విస్తృతస్థాయిలో కలిసి పని చేయటానికి సిద్దమని ప్రకటించారు.తాను రూపొందించిన నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రికి అందించనున్నట్టు తెలిపారు. వీటిని ప్రస్తుత ప్రభుత్వం కూడా అమలులోకి తేవచ్చన్నారు. కలిసి వచ్చే పార్టీలు లేక పోతే తానే సొంత రాజకీయ ప్రయత్నానికి వెనుకాడనని లక్ష్మీనారాయణ తెలిపారు.
లక్ష్మినారాయణ స్పష్టంగా రాజకీయ ప్రవేశం గురించి చెప్పడంతో.. ఆయన ఏ పార్టీలో చేరుతారన్న దానిపై చర్చ ప్రారంభమయింది. ముందుగా ఆయన తాను రూపొందించిన పీపుల్స్ మేనిఫెస్టోతో చంద్రబాబును కలుస్తానంటున్నారు కాబట్టి.. సహజంగా ఆయన టీడీపీలో చేరుతారనే ప్రచారం జరగొచ్చు. కలిసి వచ్చే పార్టీలు లేక పోతే తానే సొంత రాజకీయ పార్టీ పెట్టుకుంటానని కూడా చెబుతున్నారు. అంటే.. త్వరలో లక్ష్మినారాయణ రాజకీయ ఆరంగేట్రం ఖాయమైనట్లే. అది ఏ పార్టీ ద్వారా అన్నది తేలాల్సి ఉంది.!