మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో లాంఛనంగా చేరారు. జనసేన కండువా కప్పి, ఆయన్ని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు పవన్ కల్యాణ్. పార్టీ తరఫున లక్ష్మీనారాయణ ఎంపీగా పోటీ చేస్తారనీ, ఆయన ఏస్థానం నుంచి లోక్ సభ పోటీకి దిగుతారు అనేది ఆదివారం సాయంత్రానికి స్పష్టంగా ప్రకటిస్తామన్నారు పవన్. మిత్రపక్షాలైన వామపక్షాలతో భేటీ ఉందనీ, బీఎస్పీతో కూడా తాజాగా తమకు పొత్తు కుదిరిందనీ, ఇవన్నీ చూసుకున్న తరువాత లక్ష్మీనారాయణ పోటీ చేయబోయే స్థానంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… 2014లోనే పవన్, తాను మాట్లాడుకున్నామనీ, ప్రజలందరూ కోరుకునే ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపించాలన్న లక్ష్యంతో తమ మధ్య చర్చలు జరిగాయన్నారు. కలిసి ముందుకు వెళ్దామని పవన్ రమ్మంటే… ఆ సమయంలో కుటుంబ బాధ్యతల వల్ల కొంత వెనక్కి తగ్గాల్సి వచ్చిందన్నారు. కచ్చితంగా ఒకరోజు కలిసి పనిచేద్దామని ఆరోజే పవన్ అన్నారనీ, ఆరోజు ఈరోజు అయిందన్నారు. యువతకు మార్గం చూపించి, చేతులు పట్టుకుని ముందుకు నడిపించే వ్యక్తి కావాలనీ, ఆ వ్యక్తి పవన్ కల్యాణ్ లో తనకు కనిపించారన్నారు లక్ష్మీనారాయణ. పవన్ ప్రకటించిన మేనిఫెస్టో చాలా బాగుందనీ, దాని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారన్నారు. మంచి జ్ఞాన సంపద, ధైర్యం, ప్రజాదరణ… ఇలాంటి లక్షణాలున్న వ్యక్తులే సమాజంలో మార్పు తీసుకు రాగలరనీ, ఆ మూడు లక్షణాలూ పుణికి పుచ్చుకున్న వ్యక్తి పవన్ కల్యాణ్ అన్నారు.
వాస్తవానికి, ఆయన ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పుకోగానే… జనసేనలో చేరతారనే కథనాలు వచ్చాయి. కానీ, ఆయన సొంతంగా ఏదో చేయాలనే ఆలోచనలో రాష్ట్రంలో పర్యటించారు. ఆ తరువాత, టీడీపీలో చేరతారంటూ ఈ మధ్య ప్రచారం జరిగింది. అది నిజమో కాదో తెలుసుకోకుండానే వైకాపా, భాజపా నేతలు తీవ్ర విమర్శలు చేశారు. చివరికి ఈ చర్చలన్నింటికీ చెక్ పెడుతూ ఆయన జనసేనలో చేరారు, ఎంపీగా పోటీ చేయబోతున్నారు. అయితే, 2014లోనే జనసేనలోకి రమ్మంటూ పవన్ పిలిచినా కూడా లక్ష్మీనారాయణ అప్పుడు వెళ్లలేదు. ఆరోజు నుంచీ పవన్ తో పనిచేయాలనే ఆలోచన ఉంటే… అప్పుడే వెళ్లిపోతే జనసేనకు కూడా ఉపయోగపడి ఉండేది. ఎందుకంటే, జనసేనలో సరైన వ్యూహకర్తలు లేని పరిస్థితి మొదట్నుంచీ ఉంది. ఆలోటు చాలావరకూ భర్తీ అయ్యేది. కాకపోతే, కాస్త ఆలస్యంగా ఒక వ్యూహకర్త జనసేనలో చేరారని అనొచ్చు. ఎన్నికలకు కొద్ది సమయం ఉన్న ఈ తరుణంలో…లక్ష్మీనారాయణను ఒక నాయకుడిగా మాత్రమే జనసేన తీసుకుందా, నేపథ్యాన్ని గుర్తించి విస్తృత స్థాయిలో ఆయన సేవల్ని వినియోగించుకుంటుందా అనేదే చూడాలి.