పదవి విరమణ చేసిన తరువాత వీ వీ లక్ష్మీ నారాయణ ప్రజల్లో తిరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఆ పార్టీలో చేరతారూ, ఈ పార్టీకి మద్దతుగా వస్తున్నారూ, ఆ సామాజిక వర్గం ఓట్లు చీల్చేందుకే రంగంలోకి దిగుతున్నారు… ఇలాంటి విశ్లేషణలూ అభిప్రాయాలూ చాలానే వినిపిస్తున్నాయి. కానీ, తన కార్యాచరణ ఏంటనేది మాత్రం ఆయన స్పష్టంగా చెప్పడం లేదు. ప్రస్తుతం ప్రజల్లో తిరుగుతున్నారు కాబట్టి, కొన్నాళ్లు పరిస్థితులను అధ్యయనం చేసిన తరువాత, కార్యాచరణ ఉండొచ్చనీ కొంతమంది అంటున్నారు. అయితే, ఆయన ఇప్పటికే ఒక స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేసుకుని… దాని ప్రకారమే ముందుకు సాగుతున్నారనే అనిపిస్తోంది. కొన్నాళ్లపాటు ప్రజల్లోనే ఉంటూ, ఒక సమయం వచ్చిన తరువాత తాను తీసుకున్న నిర్ణయాన్ని వెలువరించే అవకాశం కనిపిస్తోంది.
ఇక, తాజాగా ఆయన రైతు సమస్యల గురించి మీడియాతో మాట్లాడారు. అధికారం లేకుండా సమస్యల పరిష్కారం సాధ్యమా అనే ప్రశ్నపై స్పందిస్తూ… సాధ్యమౌతుందనే తాను నమ్ముతానన్నారు. మరో రెండు నెలల తరువాత ఆలోచించుకుంటాననీ, ఈ స్థాయిలో సమస్యల పరిష్కారానికి మార్గం ఉందా, ఇంకా ఎక్కువ స్థాయికి వెళ్లాల్సిన అవసరం ఉందా అనేది ఆలోచిస్తా అన్నారు. అలాంటి అవసరం ఉందని అనిపిస్తే… రెండో మార్గం ఎంచుకోవడానికి ప్రయత్నిద్దామని లక్ష్మీనారాయణ చెప్పారు. అంతిమ లక్ష్యం రైతుల సమస్యలకు పరిష్కారం లభించాలన్నారు. ఏ స్థాయిలో అయితే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిస్తే, ఆ స్థాయికి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. తనపై చాలా కథనాలూ ఆరోపణలూ వస్తున్నాయనీ, ఇప్పుడున్న పార్టీ వాళ్లు తనని పెట్టారనీ, ఒక సామాజిక వర్గం ఓట్లు చీల్చడానికి వాడుతున్నారనీ… ఇలా చాలా వినిపిస్తున్నాయనీ, కానీ వాటిని తాను పట్టించుకోవడం లేదన్నారు.
ఒకటైతే చాలా స్పష్టం.. లక్ష్మీ నారాయణ పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. ఇప్పటికిప్పుడు అధ్యయనం చేస్తే తప్ప.. ఆంధ్రాలో ఆయనకి అర్థంకాని రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితులు ఉన్నాయని ఎవ్వరూ అనుకోరు. ఆయనో ఉన్నత స్థాయి అధికారిగా పనిచేశారు. రాష్ట్ర పరిస్థితులపైనా, తన భవిష్యత్తుపైనా స్పష్టమైన అంచనా.. ప్రణాళికా లేకుండా ఉన్నతోద్యోగాన్ని వదులుకుంటారా చెప్పండీ..! ఆయనే చెబుతున్నారు… ఒకటో రెండో నెలలు చూశాక, ఏ స్థాయిలో వెళ్తే సమస్యల పరిష్కార మార్గాలు లభిస్తాయని అనిపిస్తుందో, అక్కడికి వెళ్లాల్సిందే అని! సో.. ఆయన ఒక నిర్ణయంతోనే ఉన్నారు. అదేంటనేది ఆయన ప్రకటించే వరకూ వేచి చూడాలి.