ఎన్నికల సందడి పెరుగుతున్న కొద్దీ ఇంత కాలం సైలెంట్‌గా ఉన్న నేతలు ఒక్కొక్కరు తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ కూడా ఇటీవలి కాలంలో వివిధ మీడియాల్లో తన వాయిస్ వినిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ, వైసీపీ రెండూ బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతివ్వడంపై ఆయన విమర్శలు చేస్తూ పలు మీడియా చానళ్లకు.. యూట్యూబ్ చానళ్లకు ఇంటర్యూలు ఇచ్చారు. బీజేపీకి పూర్తి మెజార్టీ లేదని వారు పట్టుబడితే ప్రత్యేకహోదా వస్తుందన్నారు.
ఆ విషయం పక్కన పెడితే లక్ష్మినారాయణ మళ్లీ ఏ పార్టీలో చేరబోతున్నారన్న చర్చ ఊపందుకుంది. ఇలాంటి మీడియా ఇంటర్యూల్లో కూడా తాను వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తాననే చెబుతున్నారు. ఏ పార్టీ అనేది మాత్రం చెప్పలేకపోతున్నారు. జనసేన నుంచి బయటకు వచ్చిన ఆయన తర్వాత స్వచ్చంద సంస్థ పెట్టి ఆ దిశగా పని చేసుకుంటున్నారు. అక్కడక్కడా పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. అయితే రాజకీయంపై మాత్రం ఆయనకు ఆసక్తి తగ్గలేదు.
ఇప్పుడు వైసీపీ, టీడీపీతో పాటు మళ్లీ బీజేపీనికూడా విమర్శిస్తున్నందు న ఆయన జనసేన విషయంలోనే మళ్లీ కాస్త పాజిటివ్‌గా ఉన్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. కొద్ది రోజుల కిందట మళ్లీ ఆయన జనసేనలో చేరుతారన్న ప్రచారం జరిగింది. కానీ అలాంటిదే డెవలప్మెంట్ ఇంకా రాలేదు. ఇప్పుడు రాజకీయంగా పరిస్థితులు వేగంగా మారిపోతున్న సమయంలో ఆయన కూడా ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.