సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా తెలుగు ప్రజలందరికీ సుపరిచితమైన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయంగా తన భవిష్యత్‌పై ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ఢిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీ విజయాన్ని అధ్యయనం చేశారు. ఇక్కడ లోక్‌సత్తా… జయప్రకాష్ నారాయణ పరాజయాన్నీ విశ్లేషించారు. చివరికి ఏం చేయాలో.. కూడా నిర్ణయించుకున్నారు. కానీ ఆ నిర్ణయం ఏమిటో బయటకు చెప్పడానికి మొహమాటపడుతున్నారు. అయితే.. తాను స్వయంగా ఎవర్నీ అడగనని.. తనను ఆహ్వానించిన వాళ్లలో ది బెస్ట్ ఆప్షన్ ఎంచుకుంటానన్నట్లుగా లక్ష్మినారాయణ చెబుతున్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు…ఇచ్చిన ఓపెన్ హార్ట్ లో ఈ విషయంపై కాస్త గందరగోళంగానే సమాధానాలు చెప్పారు.
ప్రస్తుత రాజకీయాలపై పూర్తి స్థాయి అవగాహనతో ఉన్నట్లుగా మాట్లాడారు. అదే నిజమైతే.. ఆయన ఆమ్ఆద్మీ పార్టీని ఏపీలో నెత్తికెక్కించుకునే పని చేయరు. తనకు ఆరెస్సెస్ నేపధ్యం ఉందని.. బీజేపీలో చేరే పని అసలు చేయరు. ఆ విషయం ఆయన మాటల్లోనే అర్థమైంది. ఇంకెవరో తనను ఆహ్వానించాలని ఆయన కోరుకుంటున్నారనే భావన మాత్రం.. ఇంటర్యూ చూసిన వాళ్లకు రావడం సహజమే. సీబీఐ మాజీ జేడీని.. తమ పార్టీలో ఇప్పటికే బీజేపీ ఆహ్వానించింది. కానీ వీవీ లక్ష్మినారాయణ సిద్దంగా లేరు. సొంత పార్టీ పెట్టబోనని చెబుతున్నారు. ఇక ఏపీలో వైసీపీ ఆలోచన కూడా.. లక్ష్మినారాయణ చేరరు. ఇక జనసేన కూడా ఉంది. గతంలో… జనసేనలో చేరుతారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పుడు అటువంటి ఫీలర్లు కూడా పంపడం లేదు. ఇక మిగిలింది ఒకే ఒక్క పార్టీ . తెలుగుదేశం. లక్ష్మినారాయణ టీడీపీలో చేరుతారన్న ప్రచారం జోరుగానే సోషల్ మీడియాలో సాగింది. కానీ.. ఈ విషయంలో అసలు ఎలాంటి చర్చలు జరగలేదని.. ఓ సంసదర్భంలో… చంద్రబాబు .. బీజేపీకి ముడి పెట్టి లక్ష్మినారాయణపై విమర్శలు చేయడంతో తేలిపోయింది. సీబీఐ మాజీ జేడీకి ఉన్న క్లీన్ ఇమేజ్ను ఉపయోగించుకునేందుకు పార్టీలో చేర్చుకోవాలని టీడీపీ ఎందుకు ప్రయత్నించడం లేదన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో ఏర్పడింది.
కొన్నాళ్ల కిందట.. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వారం వారం రాసే కొత్త పలుకు ఆర్టికల్‌లో ఓ సారి.. ఆయన గత ఎన్నికల్లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని..2014లోనే లోక్‌సభకు పోటీ చేయాలనే ఆలోచన చేసినట్లు కూడా చెప్పుకొచ్చారు. కానీ.. ఈ సారి నిజంగా రాజకీయ ప్రవేశం దగ్గరకు వచ్చే సరికి.. తెలుగుదేశం పార్టీ ప్రస్తావన రావడం లేదు. జగన్ కేసులు విచారణ జరుగుతున్న కారణంగా… ఆ కేసులను విచారించిన అధికారి గా.. లక్ష్మినారాయణ టీడీపీలో చేరితే.. కేసులపై ఆ ప్రభావం ఉంటుందన్న ఆలోచన టీడీపీ వర్గాల్లో ఉందని.. అది మంచి కాదన్న భావనలో ఉన్నారని భావిస్తున్నారు. అదే సమయంలో.. లక్ష్మినారాయణ బీజేపీతో.. ఓ అండర్ స్టాండింగ్‌కు వచ్చే.. తన రాజకీయ పయనం చేస్తున్నారన్న అనుమానాలు కూడా టీడీపీ అగ్రనేతల్లో ఉన్నాయి. అందుకే ఆహ్వానించడం లేదంటున్నారు. మొత్తానికి లక్ష్మినారాయణ రాజకీయ ప్రవేశం కాస్తంత మిస్టరీగానే ఉండనుంది.