సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ.. రాజకీయంగా.. ఎటు వైపు అడుగులు వేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. ఆయన మంచి ముహుర్తం కోసం చూసుకుంటున్నారు. ఈ లోపు.. ప్రజా ఉద్యమాల్లో భాగంగా ఎవరు పిలిచిన వెళ్తున్నారు. అలాగే.. రాయలసీమ ప్రజాసంఘాలు చేస్తున్న ధర్నాకు ఆయన సంఘిభావం ప్రకటించారు. ఈ సంఘాల ప్రధాన డిమాండ్ శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయడం. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుండి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు రాయలసీమ ప్రాంతానికి ఇచ్చిన హామీల పత్రమే శ్రీబాగ్ ఒడంబడిక. దీన్ని అమలు చేయాలని లక్ష్మీనారాయణ డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ ధర్నాచౌక్లో రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు ఆయన సంఘీభావం ప్రకటించారు.
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు రాయలసీమ ప్రాంతానికి కృష్ణా, పెన్నా, తుంగభద్ర నదుల నీటిలో అధిక ప్రాధాన్యంతో పాటు రాజధాని లేదా హైకోర్టు నిర్మాణం, అనంతపురంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ శాఖ, జనాభా నిష్పత్తి ప్రకారం కాకుండా ప్రాంత విస్తీర్ణ నిష్పత్తి ప్రకారం అసెంబ్లీ సీట్ల పెంపు వంటి హామీలను శ్రీబాగ్ ఒప్పందంలో పేర్కొన్నారు. కానీ అవేమీ అమలు కాలేదు. ఇప్పుడు తెలంగాణ నుండి విడిపోయినందున.. ప్రభుత్వం ఇప్పటికైనా శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలనేది వీవీ లక్ష్మినారాయణ డిమాండ్. నిజానికి కొద్ది రోజులుగా.. ఈ శ్రీబాగ్ ఒప్పందం పేరుతో.. భారతీయ జనతా పార్టీ నేతలు హడావుడి చేశారు. ఇప్పుడు.. వీవీ లక్ష్మినారాయణ వంతు వచ్చింది.
లక్ష్మినారాయణ కూడా కడప జిల్లాకు చెందిన వారు. ఆయన చదువు అంతా శ్రీశైలంలో గడిచింది. ఓ రకంగా ఆయన రాయలసీమ వాసి. శ్రీబాగ్ ఒప్పందం మొత్తం రాయలసీమకు సంబంధించినదే కాబట్టి… ఆయన.. తన రాజకీయ కార్యాచరణలో.. ఈ శ్రీబాగ్ ఓడంబడికన చేర్చుకుని ఉద్యమిస్తారేమో చూడాలి.