ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రా పర్యటనకు ముందు రాజకీయ వేడి పెంచాలన్నదే వారి ఉద్దేశమో ఏమో తెలీదుగానీ… మరోసారి సవాళ్లకు దిగుతున్నారు మాజీ మంత్రి మాణిక్యాలరావు. ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయన తాడేపల్లిగూడెంలో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పాలనలో రాష్ట్ర అభివృద్ధి పడకేసిందన్నారు. జరిగిన ఆ కొంత అభివృద్ధిని కూడా కొన్ని ప్రాంతాలకు మాత్రమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిమితం చేశారంటూ ఆరోపించారు. ఇదే అంశమై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నాననీ, ముఖ్యమంత్రి కూడా తనతో చర్చకు వస్తారా అంటూ సవాల్ విసిరారు.
గోదావరి జిల్లాలకు ముఖ్యమంత్రి తీరని అన్యాయం చేశారన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో పశ్చిమ గోదావరి జిల్లాకు మరింత అన్యాయం జరిగిందన్నారు. ఈ జిల్లాకు చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పగలరా అనీ, ఈ ప్రాంతంపై చిన్నచూపు ఎందుకు అంటూ ఆయన విమర్శించారు. ఆయన చేసిన అభివృద్ధి ఏంటో చెప్పమంటూ మరోసారి సవాల్ చేశారు. ఈ జిల్లా ప్రజలు ముఖ్యమంత్రిపై ఆగ్రహంగా ఉన్నారన్నారు.
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై మాణిక్యాలరావు సవాల్ చేయడం విచిత్రంగా ఉంది! ఎందుకంటే, ఆంధ్రాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కేంద్రం వల్లనే, భాజపా వల్లనే జరుగుతున్నాయని కదా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మొదలుకొని నేతలందరూ చెబుతారు! పోలవరం వారే కట్టించామనీ, ఇళ్లూ మరుగుదొడ్లూ… ఇలా అన్నీ మోడీ చలవ వల్లనే వచ్చాయంటూ ఊదరగొడుతున్నారు. అంతేకాదు, కేంద్ర పథకాలకు పేర్లు మార్చి, తనవిగా చంద్రబాబు అమలు చేసుకుంటున్నారని కూడా అంటారే! అంటే… పేర్లు మార్చైనా సరే అభివృద్ధి పథకాలను చంద్రబాబు అమలు చేస్తున్నట్టుగా వారే పరోక్షంగా ఒప్పుకుంటున్నట్టే కదా. అంటే, ఆ పథకాలేవీ పశ్చిమ గోదావరి జిల్లాలో అమలు కావడం లేదా..? పోనీ, కేంద్ర పథకాలు రాష్ట్రంలో అమలు అవుతున్నాయని చెప్పుకుంటారు కదా… అవి కూడా ఆ జిల్లాలో అమలు కావడం లేదా..? ఇంతకీ ఏ పాయింట్ మీద చర్చకు సిద్ధమంటూ మాణిక్యాలరావు సవాల్ చేస్తారు..? ప్రత్యేక హోదా, రైల్వేజోన్, ఇతర విభజన హామీలు… ఇవన్నీ కేంద్రం ఎందుకు అమలు చెయ్యలేదో ఆయన చెప్పగలరా..? మరెందుకీ సవాళ్లు..?