పవన్ కళ్యాణ్ అమలాపురంలో, మల్కి పురం లో ప్రజా పోరాట యాత్ర సందర్భంగా జరిగిన సమావేశాల్లో మాట్లాడుతూ కోనసీమలో రిలయన్స్ సంస్థ చేస్తున్న దోపిడీ గురించి పదమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. అలాగే, రిలయన్స్ దోపిడిపై మాట్లాడే ధైర్యం అటు చంద్రబాబు కానీ ఇటు జగన్ కానీ చేయకపోవడంతో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని స్వాగతిస్తున్నారు చాలామంది. ఈ లిస్టులో ఇప్పుడు మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా చేరారు.
మాజీ ఎంపీ హర్షకుమార్ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. రిలయన్స్ పై పవన్ కళ్యాణ్ విమర్శలను ప్రస్తావిస్తూ వచ్చిన ఒక కథనాన్ని కూడా అదే ట్వీట్ లో జతపరిచిన హర్షకుమార్ ట్వీట్ లో ఏమన్నాడంటే, ” అవును కోనసీమ సంపదని కొల్లగొడుతున్నారు. దీనిని ప్రశ్నించే దమ్మున్న నాయకుడు కి మనం మద్దతు ఇవ్వాలి. కంపెనీలలో స్థానికులకి ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. రిలయన్స్ టర్మినల్ పాయింట్ మన దగ్గర ఉంటే మనల్ని పక్కనపెట్టి యానాం కి భారీ నజరానాలు ఇచ్చారు. ఇక్కడ జరిగిన అన్యాయం మీద గొంతెత్తిన ఆ కంఠానికి మనం బాసటగా ఉండాలి”.
అయితే హర్ష కుమార్ వ్యాఖ్యలు చూస్తుంటే రేపో మాపో జనసేన లో చేరడం ఖాయంగా కనిపిస్తోందని మరికొందరు అంటున్నారు. ఇంతకీ హర్షకుమార్ మదిలో ఏముందో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాలి.