ముఖ్యమంత్రి కుమార్తె, మాజీ ఎంపీ కవిత త్వరలో బిజీబిజీ రాజకీయ కార్యక్రమాలకు సిద్ధమౌతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి ఓటమి తరువాత క్రియాశీల రాజకీయాలకు ఆమె దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత, తెలంగాణ జాగృతి కార్యక్రమాలను కూడా ఆమె తగ్గించేశారు. అయితే, త్వరలో మరోసారి క్రియాశీలం కావడం కోసం వరుస కార్యక్రమాలను ఆమె సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. సంక్రాంతి పండుగ నుంచి ఆమె కొన్ని కార్యక్రమాలను షెడ్యూల్ చేసుకున్నట్టు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆమెని రాజ్యసభకు పంపించే అవకాశం ఉందనే చర్చ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
త్వరలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న సంగతి తెలిసిందే. దీన్లో పార్టీ ప్రచార బాధ్యతల్లో ఆమె పాలుపంచుకునే అవకాశం ఉందని తెరాస వర్గాలు అంటున్నాయి. నిజామాబాద్ లోక్ సభ పరిధిలో ఆమె కొన్ని ప్రచార సభలకు వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. నిజామాబాద్ కార్పొరేషన్, ఆర్మూర్, బోధన్, భీమ్ గల్ మున్సిపాలిటీల్లో ఆమె పర్యటించడానికి సిద్ధమౌతున్నారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం పసుపు రైతుల అంశంపై కవిత పోరాటం చేసే అవకాశం ఉందనీ, పసుపు రైతుల ఉద్యమానికి నాయకత్వం వహించాలనే ఆలోచనలో కవిత ఉన్నట్టు చెబుతున్నారు. ఈ మధ్యనే కొంతమంది మహిళా రైతులు కవితను కలిశారనీ, తమ సమస్యల్ని అర్థం చేసుకుని అండగా ఉండాలని కోరాననీ సమాచారం. దీంతో, పసుపు రైతుల తరఫున త్వరలో పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదనపై స్థానిక నేతలు, కొంతమంది రైతులతో కవిత సమావేశమై చర్చించారని తెలుస్తోంది.
పసుపు రైతులకు మేలు చేస్తామంటూ మాటిచ్చి భాజపా తరఫున ఎంపీగా ధర్మపురి అరవింద్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మధ్యనే పసుపు బోర్డుపై ఆయన యూటర్న్ తీసుకున్నారు. బోర్డుకు మించిన కొత్త పద్ధతి ఏదో వస్తుందంటూ ఇచ్చినమాటను పక్కనపెట్టేశారు. దీంతో పసుపు రైతుల్లో భాజపా మీద వ్యతిరేకత మొదలైందనే కథనాలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో రైతులకు అండగా నిలిస్తే, సొంత నియోజక వర్గంలో మరోసారి పట్టు సాధించుకునే అవకాశంగా దీన్ని మలచుకోవచ్చు. ఆ దిశగానే కవిత ప్లానింగ్ చేసుకుంటున్నట్టు సమాచారం. ఇకపై నిత్యం ప్రజల్లో ఉండే విధంగా కవిత వరుసగా కొన్ని కార్యక్రమాలను సిద్ధం చేసుకుంటున్నారు.