వైకాపాలో సీనియర్ గా నేతగా ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో వైకాపా తరఫున ఎన్నికల బరిలో ఉంటారా… అంటే, అనుమానమే అన్నట్టుగా కథనాలు వినిపిస్తున్నాయి! వైకాపాకి ఆయన రాజీనామా చేసేందుకు సిద్ధపడుతున్నట్టుగా కూడా చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు నుంచి తాను పోటీ చేసేది లేదని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి మేకపాటి స్వయంగా చెప్పినట్టుగా నెల్లూరులో చర్చ జరుగుతోంది. జగన్ వైఖరే ఇందుకు కారణమనీ అంటున్నారు!
వైకాపా పెట్టిన దగ్గర్నుంచీ వైయస్ జగన్ కు మేకపాటి వెన్నుదన్నుగా ఉన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా ఆయన ఎన్నో నష్టాలకు ఓర్చారని కూడా ఆ పార్టీ వర్గాలు అంటుంటాయి. అయినాసరే పార్టీలో ఆయనకి సరైన ప్రాధాన్యత దక్కలేదనే చర్చ ఎప్పట్నుంచో ఉన్నదే. అలాంటి మేకపాటికి వైకాపాలో ఈ మధ్య తరచూ అవమానాలు ఎదురౌతున్న పరిస్థితి ఉందట. ఈ మధ్య సర్వేల పేరుతో మేకపాటి గెలుపు ఓటములపై జగన్ కామెంట్స్ చేస్తున్నారనీ, రాబోయే ఎన్నికల్లో మేకపాటి గెలిచే అవకాశం లేదనే అంశం ఒక సర్వేలో తేలిందని జగన్ అంటున్నారనీ, రాజమోహన్ సోదరుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉదయగిరిలో ఓటమి పాలౌతారనీ అంటున్నారట. గౌతమ్ రెడ్డి విషయంలో కూడా జగన్ కొన్ని లీకులు ఇస్తున్నారనీ, ఆయన పనితీరు ఆశాజనకంగా లేదంటూ చెప్తున్నారట. మేకపాటి అనుచరుడైన మేడిక మురళికి కూడా ఈసారి వైకాపా నుంచి టిక్కెట్టు అనుమానమే అనే చర్చ జరుగుతోందట.
ఇవన్నీ మేకపాటిని కాస్త ఇబ్బంది పెడుతున్నట్టు సమాచారం. దీంతో ఆయన అభిమానులు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, తాను రాబోయే ఎన్నికల్లో పోటీ చేయకూడదని మేకపాటి నిర్ణయించుకున్నారనీ, తన వ్యక్తిగత కారణాలతో ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా జగన్ కి చెప్పారని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, వీటిపై రాజమోహన్ స్పందించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా, వైకాపాలో ఆయన వర్గం ఇబ్బంది పడుతున్నారన్నది వాస్తవం. దీంతోపాటు, ఆ పార్టీలో కొన్ని అసంతృప్తులున్నాయన్నది కూడా తేటతెల్లమౌతోంది.