కోర్టులను అడ్డుపెట్టుకొని అరెస్టు నుండి బయటపడాలనుకున్న ప్లాన్ నెరవేరకపోవటం, అరెస్టును ఊహించి అజ్ఞాతంలోకి వెళ్లాలనుకున్న ప్లాన్ బెడిసికొట్టడంతో మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేష్ పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది.
టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో నందిగం సహా పలువురు వైసీపీ నేతలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఉద్దండురాయునిపాలెంలోని ఆయన ఇంటికి వెళ్లారు. అయితే, విషయం తెలిసిన ఆయన అప్పటికే ఫోన్ స్విచ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోవటంతో పోలీసులు వెనుదిరిగారు.
అయితే, అప్పటికే నిఘా పెట్టిన పోలీసులు… సురేష్ హైదరాబాద్ వెళ్లిపోతున్నట్లు సమాచారం అందుకొని, పక్కా సమాచారంతో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నందిగం సురేష్ ను మంగళగిరికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, నందిగం అరెస్ట్ పై పోలీసులు అధికారికంగా స్పందించాల్సి ఉంది.
ఇక ఇదే కేసులో ఉన్న లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురాం సహ పలువురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వీరు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. వీరి కోసం దాదాపు 12బృందాలు గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో గాలిస్తున్నాయి.