మాజీ సైనికుల నాలుగు దశాబ్దాల పోరాటం నేటికి ఫలించింది. ఈరోజు రక్షణ మంత్రి మనోహర్ పర్రికర్ ఏప్రిల్ 1,2014 నుండి ఈ నూతన పెన్షన్ విధానం వర్తింపజేస్తామని ప్రకటించారు. కానీ గత మూడు నెలలుగా దీని కోసం డిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహర దీక్షలు చేస్తున్న మాజీ సైనికులు ఈ ఒకే హోదా-ఒకే పెన్షన్ స్వాగతించినప్పటికీ, ఇంకా ఆరు అంశాలపై కేంద్రప్రభుత్వం తమ అభ్యర్ధనలను మన్నించకపోవడాన్ని నిరసిస్తూ తమ దీక్షను కొనసాగించాలని నిర్ణయించుకొన్నారు.
ఈ పెన్షన్ విధానం స్వచ్చందంగా పదవీ విరమణ చేసినవారికి వర్తించదనే షరతుపై వారు అభ్యంతరం తెలుపుతున్నారు. ప్రతీఏట అనేక వేలమంది సైనికులు, సైనికాధికారులు వివిధ కారణాల చేత స్వచ్చందంగా పదవీ విరమణ తీసుకొంటుంటారు. కనుక వారికి ఈ పెన్షన్ విధానం వారికి వర్తింపజేయకపోవడం అన్యాయమని వారు వాదిస్తున్నారు. దీనిని అందరికీ వర్తింపజేయాలని వారు కోరుతున్నారు.
అదే విధంగా ప్రతీ ఐదేళ్ళకు ఒకసారి పెన్షన్ పెంచలన్న కేంద్రప్రభుత్వం నిర్ణయాన్ని కూడా వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రతీ మూడేళ్లకి ఒకసారి పెంచాలని వారు పట్టుబడుతున్నారు. ఈ విధానంలో లోటుపాట్లను, మాజీ సైనికుల అపరిష్కృత పిర్యాదులను, సమస్యలపై 6 నెలలకు ఒకసారి కేంద్రప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు ఏక సభ్య కమిటీని ఏర్పాటుపై కూడా కూడా వారు అభ్యంతరం చెపుతున్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి దానిలో మాజీ సైనికుల ప్రతినిధులను కూడా సభ్యులుగా నియమించాలని వారు కోరుతున్నారు. రక్షణ మంత్రి క్రింద ఆ కమిటీ పనిచేయాలని, ఆరు నెలలకొకసారి కాకుండా ప్రతీనెలా రక్షణ మంత్రికి కమిటీ నివేదిక ఇస్తుండాలని వారు కోరుతున్నారు. తమ అభ్యంతరాలను కేంద్రప్రభుత్వం పరిష్కరించేవరకు తమ పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు. వారి డిమాండ్స్ లో కమిటీ ఏర్పాటుపై కేంద్రప్రభుత్వం పునః పరిశీలిస్తుందని రక్షణ మంత్రి హామీ ఇచ్చారు. మిగిలిన విషయాలను చర్చల ద్వారా పరిష్కరించుకొందామని, కనుక తక్షణమే తమ దీక్షలు నిలిపి వేయాలని ఆయన మాజీ సైనికులను కోరారు. ఈ నూతన పెన్షన్ విధానం వలన సుమారు 22 లక్షల మంది మాజీ సైనికులు మరో 6 లక్షల మంది మాజీ సనికుల వితంతువులకి లబ్ది కలుగుతుందని మంత్రి తెలిపారు.