అవినీతి వ్యతిరేక యోధుడిగా చెప్పుకొనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిజస్వరూపం బయటపడింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కార్యదర్శి రాజేంద్ర కుమార్ పై సీబీఐ దాడులు చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. కేజ్రీవాల్ ఏ స్థాయికి దిగజారారంటే, ప్రధాని మోడీపై ట్విటర్లో అత్యంత అభ్యంతరకరమైన కామెంట్లు చేశారు. తన కార్యదర్శిపై దాడులు జరిగాయనే కోపంలో, సభ్యతను కూడా మర్చిపోయారు.
రాజేంద్ర కుమార్ ఒక అధికారి. ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రికి కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన అవినీతి పాల్పడ్డారనే సమాచారంతో సీబీఐ దాడి చేసింది. ఒకవేళ దాడి తర్వాత ఆయన నిర్దోషి అని తేలితే, అప్పుడు అది రాజకీయ కుట్ర అని విరుచుకు పడవచ్చు. కానీ, తన ఆఫీసుమీదే దాడులు జరిగాయంటూ కేజ్రీవాల్ అబద్ధాన్ని ప్రచారం చేశారు.
కేజ్రీవాల్ చెప్పేదొకటి, చేసేదొకటని ఇప్పటికి చాలా సార్లు రుజువైంది. మొదటిసారి ఆయన ప్రభుత్వం ఏర్పడినప్పుడు, అర్ధరాత్రి విదేశీ మహిళల ఇంటిపై వారెంట్ లేకుండా దాడి చేయాలని పోలీసులపై అప్పటి మంత్రి సోమనాథ్ భారతి ఒత్తిడి చేశారు. అర్ధరాత్రి వేళ, కేవలం ఆడవాళ్లు మాత్రమే ఉండే ఇంటిపై వారెంట్ లేకుండా దాడి చేయాలన్న సోమనాథ్ ను ప్రజలు విమర్శిస్తే, కేజ్రీవాల్ మాత్రం సమర్థించారు.
ఇటీవల న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ ను నకిలీ డిగ్రీల కేసులో పోలీసులు అరెస్టు చేశారు. అంతే, కేజ్రీవాల్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. తన పార్టీవారిని టచ్ చేస్తారా అనే తరహాలో పోలీసులనే కాదు, చివరకు ప్రధాని మోడీని కూడా విమర్శించారు. ఆరోపణలు గుప్పించారు. చివరకు నకిలీ డిగ్రీలనేది నిజమని తేలడంతో నోరు మూసుకున్నారు.
గత ఏడాది పార్లమెంటు ఎన్నికలకు ముందు ఎవర్ని పడితే వాళ్లను అవినీతిపరులని నోటికొచ్చిన ఆరోపణలు చేశారు. అదేదో కోర్టు తీర్పు అన్న తరహాలో, తనకు తోచిన పేర్లు రాసుకున్న ఓ లిస్టును పట్టుకుని, అందులోని వారంతా అవినీతి పరులేని ఆరోపించారు. సోనియా గాంధీ, నరేంద్ర మోడీ సహా అనేక మంది నాయకులు అవినీతి పరులని ప్రకటించేశారు. దానికి ఆధారం ఏమిటి? అవేమీ చెప్పలేదు. కేజ్రీవాల్ అన్నారు కాబట్టి వారంతా అవినీతి పరులే అని అందరూ నమ్మాలి. ఇలాంటి ఆరోపణ చేసినందుకు వారు కోర్టుకు వెళ్తే?
కేజ్రీవాల్ రెండు నాల్కలకు మించి మాట్లాడుతున్నారు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ కు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆ ఫైళ్లు తమ దగ్గర ఉన్నాయి కాబట్టే వాటికోసం సీబీఐ దాడి చేసిందని మరో ఆరోపణ చేశారు. ఫిబ్రవరి 14వ తారీఖును కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అది జరిగిన 10 నెలల తర్వాత, నిన్న డిసెంబర్ 15న రాజేంద్ర కుమార్ పై సీబీఐ దాడులు జరిపింది. నిజంగా జైట్లీ అవినీతికి పాల్పడి ఉంటే ఈ 10 నెలలూ కేజ్రీవాల్ ప్రభుత్వం ఏం చేసినట్టు? ఎందుకు విచారణ జరిపించ లేదు? దీని గురించి ఎందుకు సీరియస్ గా చర్చించ లేదు? దీనికి జవాబు లేదు. నోటికొచ్చిన మాటలు మాట్లాడటం, అబద్ధాలను నిజాలుగా నమ్మించడానికి ప్రయత్నించడం అరవిందుడికి అలవాటే అనేది కమలనాథుల విమర్శ. తన కార్యదర్శిగా నియమించుకునే అధికారి చరిత్ర ఏమిటో, బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసుకోక పోవడం కేజ్రీవాల్ తప్పని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే కూడా వ్యాఖ్యానించారు.
ఇప్పుడు రాజేంద్ర కుమార్ వ్యవహారంలో కేజ్రీవాల్ అండ్ కో అంతగా ఉలికిపడటానికి కారణం ఏమిటి? తన దగ్గర పనిచేసే అధికారి అవినీతిపరుడైతే చర్య తీసుకోవద్దనేది కేజ్రీవాల్ ఉద్దేశమా? లేక ఆ అధికారి కేజ్రీవాల్ అండ్ కో కు ఏవైనా మెహర్బానీ పనులు చేసి పెడుతున్నారా? ఆయన వల్ల వీరికి ఏమైనా మేళ్లు జరుగుతున్నాయా? అవి బయటప పడతాయని భయపడుతున్నారా? అందుకే ఇంత రాద్ధాంతం చేస్తున్నారా? మొత్తం 14 చోట్ల దాడులు జరిగాయి. వాటిలో ఒకటి, సచివాలయంలోని కుమార్ ఆఫీసు. సీఎం ఆఫీసులోకి ఎవరూ పోలేదు. అయినా ఆప్ నేతలు తమ వాగ్ధాటిని, సోషల్ మీడియాను ఉపయోగించడంలో తమకున్న ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఇంతకీ నిజం ఏమిటనేది నిలకడమీద తెలుస్తుంది. సత్యమేవ జయతే.