హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ మేయర్ పదవిని గతంలో అన్ని పార్టీల వారికీ ప్రజలు కట్టబెట్టారని, ఈ సారి టీఆర్ఎస్కు అధికారం కట్టబెడితే గత 50 ఏళ్ళలో పాలకులు చేయలేనివన్నీ చేసి చూపిస్తామని కేటీఆర్ అన్నారు. ఐదేళ్ళలో హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలు హైదరాబాద్ నగరానికి చేసిందేమీ లేదని అన్నారు. బీజేపీ నేతలు కొందరు ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఒకేసారి ఇవ్వలేమని, దఫదఫాలుగా వచ్చే నాలుగేళ్ళలో నగరంలోని నిరుపేదలందరికీ ఇస్తామని చెప్పారు. అప్పటిదాకా ఓపిక పట్టాలని అన్నారు. ఎన్నికలకోసం దొంగమాటలు చెప్పాల్సిన పని లేదని చెప్పారు. హైదరాబాద్‌లో ఇంకా చేయాల్సింది చాలా ఉందని అన్నారు. హైదరాబాద్‌ను తామే కట్టామని, ప్రపంచపటంలో పెట్టామని కొందరు డబ్బాలు కొట్టుకుంటున్నారంటూ చంద్రబాబుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్రమోడీపై కూడా నిప్పులు చెరిగారు.