రోజా మీద ఏడాది పాటు సస్పెన్షన్ విధించినందుకు ఆమె కోర్టుకు వెళ్లి.. తన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేయించే మధ్యంతర ఆదేశాలు పొంది, ఇటు శాసనసభలోకి అనుమతి పొందకుండా.. గాంధీ విగ్రహం వద్ద ధర్నాలు చేస్తూ.. రాజకీయ వేడిని సృష్టిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఒక రోజాను ఏడాది సస్పెండ్ చేసిన వ్యవహారమే.. యావత్ వైకాపా సభ్యులు నల్లచొక్కాలతో సభకు వచ్చి.. బీభత్సం చేసేంత రగడగా సాగుతూ ఉండగానే, అదేమాత్రం పట్టనట్లుగా విపక్షానికి చెందిన మరో సభ్యుడి మీద కూడా ఏడాది సస్పెన్షన్ వేటు వేయడానికి రంగం సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
శనివారం నాడు సమావేశం అయిన శాసనసభ ప్రివిలేజ్ కమిటీ శీతాకాల సమావేశాల్లో జరిగిన రభసల గురించి పూర్తిస్థాయిలో చర్చించింది. తాము ఇచ్చిన నోటీసులకు విపక్ష సభ్యులు ఇచ్చిన సమాధానాల్ని కూడా వారు చర్చించారు. వైకాపాకు చెందిన జ్యోతుల నెహ్రూ, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలు ఇచ్చిన సమాధానాలతో ప్రివిలేజ్ కమిటీ సంతృప్తి చెందినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే రోజా లేఖ రూపంలో పంపిన సమాధానం పట్ల వారు సంతృప్తి చెందలేదు. అలాగే కొడాలి నాని వివరణ కూడా వారికి బోధపడలేదు. దీంతో ఈ ఇద్దరి మీద ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేసేలా ప్రివిలేజ్ కమిటీ శాసనసభ స్పీకరుకు సిఫారసు చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
రోజా పలుమార్లు నోటీసులు పంపినా.. ప్రివిలేజ్ కమిటీ ముందు విచారణకు హాజరు కాకపోవడం పట్ల కమిటీ సీరియస్ అయినట్లు చెబుతున్నారు. అయితే ఈ కమిటీ మీటింగులో ఉన్న జ్యోతుల నెహ్రూ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు అనారోగ్య కారణాల వల్ల రోజాకు మరో అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించినప్పటికీ ప్రివిలేజ్ కమిటీ మెజారిటీ సభ్యులు పట్టించుకోలేదని సమాచారం. దాంతో వారిద్దరూ కేవలం తమ డిసెంట్‌ను రాయడానికి మాత్రమే పరిమితం అయ్యారు. మొత్తానికి ప్రివిలేజ్ కమిటీ సిఫారసులు శనివారం నాడే ఇచ్చేస్తారన్నది సమాచారం కాగా, సోమవారం తిరిగి సభ కొలువుదీరే వేళకు రోజా, ఆమెకు తోడుగా కొడాలి నాని మీద కూడా ఏడాది సస్పెన్షన్ వేటు పడవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే.. పాలక- విపక్షాల మధ్య రాజకీయ ప్రతిష్టంభన మరో అంచె ముందుకు వెళ్లే ప్రమాదం ఉంది.