ఏపీలో గ్రూప్ వన్ అధికారుల్లో ఓ రకమైన ఆగ్రహం వెల్లువెత్తుతోంది. కన్ ఫర్డ్ ఐఏఎస్ల కోసం పూర్తి స్థాయిలో కడపకు చెందిన రెడ్లకే ప్రతీ సారి ప్రాధాన్యం ఇస్తూండటంతో మండిపోతున్నారు. తాజాగా రెండు పోస్టుల కోసం జరగాల్సిన ఇంటర్యూల విషయంలో పది మందిని ఎంపిక చేస్తే అందులో ఐదుగురు కడపకు చెందిన రెడ్లు ఉండటం సంచలనంగా మారింది. గుట్టుగా పూర్తి చేయాలనుకున్న వ్యవహారం బయటకు రావడంతో చంద్రబాబు వాటిని ఆపేయాలని యూపీఎస్సీకి లేఖ రాశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నాన్ రెవెన్యూ ఐఏఎస్ పోస్టులు రెండు ఖాళీలున్నాయి. రెండు పోస్టుల భర్తీ ప్రక్రియ నడుస్తోంది. ఎంత దరఖాస్తు చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం చివరిగా పది మందిని సిఫారసు చేయాల్సి ఉంటుంది. వారిని యూపీఎస్సీ ఇంటర్యూలు చేస్తుంది. ఇలా పది మంది పేర్లను ఏపీ ప్రభుత్వం యూపీఎస్సీ కి పంపింది. ఈ పది మందిలో ఐదుగురు రెడ్డి వర్గానికి చెందిన వారు.
గడికోట మాధురి రెడ్డి అనే ఆమె జవహర్ రెడ్డికి పీఎస్. ఆమెకు అర్హత లేకపోయినా ఐఏఎస్ ఇప్పించాలని సీఎస్ ప్రయత్నిస్తున్నారు. కౌంటింగ్ పూర్తయ్యేలోపే ఇంటర్యూలు చేయాలని యూపీఎస్సీ మీద ఒత్తిడి చేస్తున్నారు. గత నవంబర్లోనూ ప్రభుత్వం ఇద్దరు అధికారులకు కన్ఫర్డ్ ఐఏఎస్ హోదా ఇప్పించింది. డాక్టర్ నీలకంఠా రెడ్డి, బొమ్మినేని అనిల్ కుమార్ రెడ్డిలు ఇద్దరికి IAS లుగా ఇప్పించింది. వీరిద్దరూ కడపకు చెందిన వారే. ఒక్క సామాజికవర్గాన్నే హైలెట్ చేస్తూ మిగతా అందర్నీ విస్మరించడంపై ఉన్నతాధికారుల్లోనూ అసంతృప్తి కనిపిస్తోంది.