అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు క్రాష్ అయిపోయాయి. ఆ ఫలితం ప్రభుత్వం లాగేసుకుంటోంది. ధరలు తగ్గించకుండా.. టాక్స్‌లు పెంచేస్తోంది. తాజాగా.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.3 చొప్పున పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికిప్పుడు టాక్స్ పెంచాల్సిన అవసరం ఎందుకొచ్చిందంటే.. .అంతర్జాతీయ ధరలు తగ్గినందున.. ఒక్కో లీటర్‌కు కనీసం పదిహేను రూపాయల వరకు ధర తగ్గించాల్సి ఉంది. కానీ తగ్గించకుండా.. ఇప్పుడు ఉన్న రేటునే అటూ ఇటూ బ్యాలెన్స్ చేసి.. సొమ్ము చేసుకోవాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఎక్సైజ్ టాక్స్‌ల పెంపు వల్ల… ప్రస్తుతానికి వినియోగదారుడికి రేట్లు పెరగవు కానీ.. ఆ లాభం మొత్తం.. రేటు తగ్గించకుండా ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుటుంది. ఈ పెంపు వల్ల ప్రజల వద్ద నుంచి కేంద్రం పిండుకునేది రూ. 39వేల కోట్లు.
యూపీఏ-2 హయాంలో… బ్యారెల్ క్రూడాయిల్ ధర 140 డాలర్ల వరకూ వెళ్లింది. 80 శాతం దిగుమతుల మీద ఆధారపడుతుంది మనదేశం.. అంత భారీగా క్రూడాయి ధర ఉన్నప్పుడు.. ఐదేళ్ల క్రితం.. పెట్రోల్ ధర… రూ. 60కి అటూఇటుగా ఉండేది. ఇప్పుడు క్రూడాయిల్ ధర అత్యంత దారుణంగా పడిపోయి 25 డాలర్లకు కూడా వచ్చింది.. అయినా పెట్రోల్ రేటు.. 75 రూపాయల దగ్గర ఉంటోంది. మోడీ 2014లో అధికారం చేపట్టిన లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజు పన్ను రూ.9.48 వున్నదల్లా 2018కి రూ.21.48 కి పెంచారు. పెట్రో ట్యాక్సుల వల్ల 2014-15లో రూ. 1.05 లక్షల కోట్లు. అదే నాలుగేళ్ల తర్వాత 2018-19లో రూ.2.57 లక్షల కోట్లకు చేరింది. తాజా పెంపుతో అది మూడు లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది.
దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులు అదనం. ఏపీ సర్కార్.. ఈ విషయంలో మరింత దూకుడుగా ఉంది. నెల వ్యవధిలో రెండుసార్లు పన్నులు పెంచారు. ఇప్పుడు దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు అత్యధికంగా ఏపీలోనే ఉన్నాయి. ఒకప్పుడు… ఇలా ఎక్కువ పన్నులున్నాయని… ప్రభుత్వంపై విరుచుకుపడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు.. తాను రేట్లు తగ్గుతున్నప్పుడు కూడా పన్నులు పెంచుకుంటూ పోతున్నారు. కేంద్రమూ అదే పని చేస్తోంది. సామాన్యులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నా.. వారి నుంచి కావాల్సింత పిండుకోవడానికే ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.