మహేష్‌బాబు – రాజమౌళి కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. `గుంటూరు కారం` తరవాత… మహేష్ నటించే సినిమా ఇదే. ఇప్పటికే స్క్రిప్టు దాదాపుగా లాక్ అయిపోయింది. ఏప్రిల్ నుంచి చిత్రీకరణ మొదలెడతారు. ఈ సినిమాలో కథానాయిక ఎవరన్న విషయంలో చాలా రోజుల నుంచీ డిస్కర్షన్స్ జరుగుతున్నాయి. దీపికా పదుకొణే పేరు గట్టిగా వినిపించింది. ఇప్పుడు ఈ సినిమా కోసం ఓ ఇండోనేషియన్ కథానాయికని ఎంచుకొన్నారని సమాచారం. తన పేరు… చెల్సియా ఇస్లాన్. కొన్ని హాలీవుడ్ చిత్రాల్లో నటించింది. ఇటీవల ఆమెను స్క్రీన్ టెస్ట్ కూడా చేశారని, ఈ సినిమాలో ఆమె రాక దాదాపు ఖాయమని తెలుస్తోంది. చెల్సియాని కథానాయిక పాత్ర కోసం ఎంచుకొన్నారా, లేదంటే కీలక పాత్ర కోసం తీసుకొన్నారా? అనేది తెలియాల్సివుంది. `ఇండియానా జోన్స్` తరహాలో సాగే కథ ఇది. మూడు దేశాల్లో కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నారు. దాదాపు సగం సినిమా ఒకే సెట్లో జరగబోతోందని తెలుస్తోంది. అందుకోసం ఓ విశాలమైన సెట్ ని తీర్చిదిద్దే పనిలో చిత్రబృందం నిమగ్నమై ఉంది. ఈ సినిమా కోసం దాదాపు రూ.1500 కోట్లు ఖర్చు పెట్టనున్నట్టు టాక్. త్వరలోనే రాజమౌళి ఓ ప్రెస్ మీట్ పెట్టి, చిత్ర వివరాల్ని మీడియాతో పంచుకొనే అవకాశాలు ఉన్నాయి.