వెంకటేష్ – త్రివిక్రమ్.. ఈ కాంబో చూడాలన్నది అభిమానుల కోరిక. వెంకటేష్ నటించిన `నువ్వు నాకు నచ్చావ్`, `మల్లేశ్వరి` చిత్రాలకు త్రివిక్రమ్ సంభాషణలు అందించారు. అయితే దర్శకుడిగా మారాక.. వీళ్ల కాంబో సెట్ కాలేదు. మధ్యలో చాలా ప్రయత్నాలు జరిగాయి కానీ, ఏదీ వర్కవుట్ కాలేదు. అయితే ఇప్పుడు ఈ కాంబో ఫిక్సయ్యింది. వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ ఓ సినిమా చేయబోతున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి సూపర్ డూపర్ హిట్ తరవాత ఎలాంటి సినిమా చేయాలి? అనే విషయమై వెంకటేష్ చాలారోజులుగా తర్జన భర్జనలు పడుతున్నాయి. చాలా కథలు విన్నారు. చివరికి త్రివిక్రమ్ తో జట్టు కట్టడానికి రెడీ అయ్యారు.
మరోవైపు బన్నీతో త్రివిక్రమ్ ఓ సినిమా చేయాలి. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈలోగా అట్లీ – బన్నీ సినిమా ఓకే అయ్యింది. దాంతో త్రివిక్రమ్ కి మరింత సమయం దొరికింది. ఈలోగా బన్నీ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేసి, వెంకీ సినిమాని చక చక ముగించాలన్న ఆలోచనలో ఉన్నారు. వెంకటేష్ తో త్రివిక్రమ్ ఓ ఫ్యామిలీ డ్రామా చేస్తారని టాక్. కాబట్టి.. త్వరగానే షూటింగ్ ముగుస్తుంది. ఆ వెంటనే బన్నీ సినిమాని మొదలు పెట్టొచ్చన్న ఉద్దేశంతో ఉన్నారు త్రివిక్రమ్.