ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల విషయంలో తీసుకున్న నిర్ణయం.. ఇచ్చిన జీవోలపై ఇండస్ట్రీ నుంచి ఎలాంటి రెస్పాన్ లేదు. పైగా మెగా క్యాంప్ కి అధికార ప్రతినిధిలాగా నాగేంద్రబాబు మీడియాకు ఇంటర్యూలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని పొగిడేశారు. అంటే ఇక మెగా ఫ్యామిలీ నుంచి నోరెత్తేవాళ్లు ఉండరు. ఇక ఇతర టాప్ హీరోలు కూడా.. మాట్లాడరు. ఇరగబడిపోయే ఫ్యాన్స్ ఉన్నారని… రూ. కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్లు తీసుకునేవారికి మాట పడిపోయింది. ఓపెనింగ్సే ఇన్ని కోట్లోస్తాయని లెక్కలేసి మరీ వాటాలు తీసుకునే హీరోలు ఈ సమయంలో నోరెత్తడానికి భయపడుతున్నారు. ఎందుకంటే వారికి పోయేదేం లేదు…! కానీ అసలు నష్టపోయేది మాత్రం ఎక్కువగా ఎగ్జిబిటర్లే. అందుకే వారంతా ఇక హీరోల్ని.. ఇండస్ట్రీ పెద్దల్ని నమ్ముకోవడం కన్నా వెళ్లి పాలక పెద్దల కాళ్లు పట్టుకుందామని డిసైడైపోయారు. ఈ విషయం తెలిసి కూడా హీరోల్లో కదలిక ఉండటం లేదు.
ఒక్కో ధియేటర్‌పై రూ. రెండు కోట్లకుపైగా పెట్టుబడి..!
ఎగ్జిబిటర్స్. అంటే ధియేటర్ ఓనర్లు లేదా లీజు దారులు. సినిమా ప్రేక్షకుడికి చేరే దశలో ఎగ్జిబిటరే చివరిగా ఉంటారు. ఆ చివరి వ్యక్తే ప్రేక్షకుల నుంచి డబ్బులు వసూలు చేసి నిర్మాత వరకూ చేరుస్తాడు. ఈ ఎగ్జిబిటర్ ఇప్పుడు… ఏపీ సర్కార్ నిర్ణయంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. పదేళ్ల క్రితం టిక్కెట్ ధరలను ఇప్పుడు ఖరారు చేశారు. కానీ ఎగ్జిబిటర్లు ఈ పదేళ్ల కాలంలో ఒక్కో ధియేటర్‌పై కనీసం రూ. రెండు కోట్ల పెట్టుబడి పెట్టారు. ఇటీవలి కాలంలో సినిమా ప్రదర్శన రంగంలో సంచనాత్మక మార్పులు వచ్చాయి. సినిమా చిత్రీకరణ సమయంలోనే మార్పులు రావడంతో వాటిని ప్రదర్శించాలంటే.. ప్రత్యేకమైన హంగులు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. డాల్బీ డీటీఎస్ , ఆట్మాస్, వంటివాటితో పాటు అనేక రకాల టెక్నాలజీలు ఏర్పాటు చేసుకోవడమే కాదు.. ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ వెర్షన్స్‌ను ఉపయోగించాల్సి వస్తోంది. ఈ కారణంగా నిర్వహణ ఖర్చు తడిచి మోపెడవుతోంది. దానికి తోడు.. కరెంట్ బిల్లులు… ఉద్యోగుల జీతాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. పదేళ్ల కిందటితోపోలిస్తే.. ఇప్పుడు సిబ్బంది జీతాలు రెట్టింపు అయ్యాయి. కరెంట్ బిల్లులూ అంతే. దానికి తగ్గట్లుగా టిక్కెట్ల రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి… సర్దుకుపోతున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద బండేసింది.
వకీల్ సాబ్‌కు అడ్వాన్సులు కట్టి నిండా మునిగిన ఎగ్జిబిటర్లు..!
ఎగ్జిబిటర్లు సాధారణంగా రెవిన్యూ షేర్ పద్దతిలోనే సినిమాలను ఆడిస్తూంటారు. ఈ కారణంగా ఓ ధియేటర్లో కొత్త సినిమా రిలీజ్ అయితే.. వారానికి రూ. ఐదు లక్షల రెవిన్యూ వస్తే.. అందులో ఇరవై శాతమో…ముఫ్పై శాతమో తీసుకుంటారు. అదే మల్టిప్లెక్స్‌లు అయితే యాభై శాతం వరకూ తీసుకుంటాయి. అందుకే… పెద్ద సినిమాలను తమ ధియేటర్లలో ప్రదర్శించేందుకు.. అడ్వాన్సులు కూడా ఇచ్చేందుకు కొంత మంది సిద్ధపడుతూంటారు. అలా వకీల్ సాబ్ రిలీజైన దాదాపుగా ప్రతీ ఎగ్జిబిటర్ కూడా.. అడ్వాన్సులు కట్టారు. కానీ ఇప్పుడు వారి అడ్వాన్సుల మొత్తం కూడా వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. కృష్ణాజిల్లాలో మొదటి రోజు రూ.మూడు కోట్ల కలెక్షన్లు అంచనా వేస్తే.. అన్ని ధియేటర్లు హౌస్ ఫుల్ అయినా రూ. కోటి మాత్రమే ఆదాయం వచ్చింది. అన్ని జిల్లాల్లోనూ అదే పరిస్థితి. అందుకే ఎగ్జిబిటర్ల గుండె గుభిల్లుమంది.
సంక్షోభంలో సమయస్ఫూర్తితో వ్యవహరించని పరిశ్రమ పెద్దలు..!
వకీల్ సాబ్ విషయంలో కేవలం… ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించిందని అందరికీ తెలుసు. ప్రభుత్వ పెద్దలతో సినిమా రంగానికి చెందిన వారు.. అత్యంత సన్నిహితంగా మెలుగుతూ ఉంటారు. చేసే ప్రతీ పనికి పొగడ్తలు కురిపిస్తూంటారు. కానీ వారెవరూ.. ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయలేదు. తెర వెనుక ప్రయత్నాలు చేశారో లేదో తెలియదు. కానీ బయటకు మాత్రం నోరెత్తడం లేదు. సినిమా బడ్జెట్లో అరవై శాతం వరకూ రెమ్యూనరేషన్‌గా తీసుకునే హీరోలే మాట్లాడకపోవడంతో ఇంకెవరూ నోరెత్తే సాసహం చేయడం లేదు. దీంతో ఎగ్జిబిటర్లే.. తమను తామే కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వాన్ని బతిమాలుకుని అయినా గండం నుంచి గట్టెక్కాలన్న ఆలోచన చేస్తున్నారు.
వ్యక్తిగత ప్రయోజనాలు కోసమే తిప్పలు..! ఇండస్ట్రీ వ్యవస్థలన్నీ బలి..!
ఒక వేళ ఎగ్జిబిటర్ల దుస్థితిని చూసి.. ప్రభుత్వం ఏమైనా మినహాయింపులిస్తే… మొదటగా లాభపడేది సోకాల్డ్ హీరోలే. ఇప్పటికే ఎగ్జిబిటర్లు.. కొంత మంది లీజు దారుల చేతుల్లో చిక్కి విలవిల్లాడుతున్నారు. టిక్కెట్ రేట్లను తగ్గించడం వల్ల వారు కూడా లీజులను తగ్గిస్తే.. మొత్తానికే మోసం వస్తుంది. సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వంపై పోరాడైనా సరే.. ఐకమత్యంగా ఉండి… పరిశ్రమను కాపాడుకోవాల్సిన పెద్దలు…ప్రస్తుత పరిస్థితిని అలా వదిలేశారు. పైగా పొగడ్తలు ప్రారంభించారు. పెట్టుబడులు పెట్టి అన్యాయమైపోతామని ఎగ్జిబిటర్లే విలవిల్లాడిపోతున్నారు.