గ్రేటర్ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ మొత్తం బోల్తా కొట్టాయి. ఒక్కటంటే.. ఒక్క సంస్థ కూడా సరిగ్గా ఫలితాలను అంచనా వేయలేకపోయింది. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వేవ్ ను అంచనా వేయలేకపోయాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే… ఆరా నుంచి పీపుల్స్ పల్స్ అంటూ..అనేక ఊరూపేరూ లేని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. అన్నింటిలోనూ టీఆర్ఎస్కే అగ్ర తాంబూలం ఇచ్చారు. కొన్ని సర్వేలు అయితే… కేటీఆర్, కేసీఆర్ ఎక్కడ ఇబ్బంది పడతారోనన్నట్లుగా ఏకంగా 101 సీట్లు కూడా ఇచ్చాయి.
కానీ చివరికి ప్రజాభిప్రాయాన్ని ఎవరూ అంచనా వేయలేకపోయారు. హోరాహోరీగా సాగిన ఫలితాల్లో…టీఆర్ఎస్ నాలుగైదు సీట్లు ఎక్కువ తెచ్చుకున్నా… ఘోరపరాజయం కిందనే లెక్క తేలుతోంది. ఇంత దారుణమైన ఫలితాల్ని ఏ సర్వే సంస్థ అంచనా వేయలేదు. తెలంగాణలో ఉన్న సర్వే సంస్థలన్నీ ఏ మాత్రం వనరులు లేని.. సింగిల్ షట్టర్లో ఉండే సంస్థలే. ఆయా పార్టీల వద్ద డబ్బులు తీసుకుని వారికి తగ్గట్లుగా సర్వే ఫలితాలు ప్రకటించడంలో రాటుదేలిపోయాయి. ఇప్పుడు ఆ విషయం నిరూపితమయింది.
సర్వేల ద్వారా ప్రజాభిప్రాయాన్ని మార్చవచ్చని కొన్ని పార్టీలు అనుకుంటూ ఉంటాయి. అలాంటి పార్టీలకు..ఈ కొత్త తరం పొలిటికల్ స్ట్రాటజిస్టులు.. స్రవే సంస్థల పేరుతో.. వల వేస్తున్నారు. పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుని కావాల్సినట్లుగా సర్వేలు వేసిస్తున్నారు. ఇలాంటి వారందరికీ గడ్డు పరిస్థితి ఏర్పడింది.