బిహార్ చివరి దశ ఎన్నికలు ఈరోజుతో ముగిసాయి. అందుకోసమే చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్న మీడియా సంస్థలన్నీ తమ సర్వే ఫలితాలను ప్రకటించాయి. ఇండియా టుడే, ఇండియా టీవీ చానల్స్ తప్ప మిగిలినవన్నీ నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, మరో మూడు పార్టీలు కలిసి ఏర్పాటు చేసుకొన్న మహా కూటమి (జనతా పరివార్) కే విజయావకాశాలున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. ఆ సర్వే ఫలితాలు తమకు వ్యతిరేకంగా వచ్చేయి కనుక వాటిని ‘కాకి లెక్కలు’ అని కొట్టి పడేసింది. బిహార్ లో తమ కూటమే విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పింది. మీడియా వెలువరిచిన సర్వే ఫలితాలు మహా కూటమి వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నప్పటికీ ఎన్డీయే కూటమి కూడా కనీసం 90-113 సీట్లు వరకు గెలుచుకోవచ్చని చెపుతున్నందున, ఫలితాలు వెలువడేవరకు రెండు కూటములకి సమానావకాశాలు ఉన్నట్లేనని బీజేపీ నేతలు భావిస్తున్నట్లున్నారు.
ఒకవేళ మహా కూటమి అధికారంలోకి వచ్చి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు అయితే దానిలో లాలూ ప్రసాద్ యాదవ్ కి చెందిన ఆర్.జె.డి. కూడా ప్రధానభాగస్వామి అవుతుంది కనుక ఆయన వెనుక నుండి కర్ర పెత్తనం చేయక మానరు. అది తరచూ వారిరువురిపై ఘర్షణలకు దారి తీయవచ్చును కనుక ప్రభుత్వం ఎప్పుడూ అస్థిరంగా సాగే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ నితీష్ కుమార్ (జె.డి.యు.) కాంగ్రెస్ పార్టీ కలిసి ప్రభుత్వం వీలయినన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకొన్నట్లయితే అప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ని పక్కన పెట్టి వేరే ఇతర పార్టీల నుంచి మద్దతు తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లయితే అది సుస్థిరంగా సాగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 117 మంది ఎమ్మెల్యేలు అవసరం.
ఒకవేళ ఎన్డీయే కూటమి కనీసం 100 స్థానాలు దక్కించుకోగలిగినా, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమయిన మిగిలిన 17 మంది ఎమ్మెల్యేల మద్దతు పొందడం పెద్ద కష్టం కాకపోవచ్చును. అందుకే ప్రధాని నరేంద్ర మోడి చాలా ముందు చూపుతో ములాయం సింగ్ ని దువ్వుతున్నారు. ఆయన కూడా మోడీ నామస్మరణ చేస్తున్నారు. ఇవ్వాళ్ళ అన్ని సర్వే సంస్థలు తమ ఫలితాలను వెల్లడించాయి కనుక నేటి నుండి బీజేపీ విజాయవకాశాలున్న చిన్నా చితకా పార్టీలను లైన్లో పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టవచ్చును.