కర్ణాటకలో ఎగ్టిట్ పోల్స్ మొత్తాన్ని వడపోస్తే.. తేలేదేమిటంటే… హంగ్ అసెంబ్లీ ఖాయమని. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండు పార్టీలు… మ్యాజిక్ మార్క్‌కు ఇరవై, ముప్ఫై సీట్ల మధ్య నిలిచిపోతాయని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. దీంతో అందరి చూపు… దేవేగౌడ నేతృత్వంలోని జనతాదళ్ సెక్యులర్ పై పడింది. మొదటి నుంచి జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుందన్న అంచనాలున్నాయి. దానికి తగ్గట్లుగానే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. పదిహేనో తేదీ ఫలితాలు కూడా ఇలానే వస్తే… పరిస్థితి ఎలా ఉంటుందన్నది… ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
హంగ్ అంటూ వస్తే… జేడీఎస్ కింగ్ మేకరే…. కానీ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూడనంత వరకే. ఇప్పటికే… జేడీఎస్‌లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన వారిలో తమకు అనుకూలంగా ఉన్న వారితో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ సంప్రదింపులు ప్రారంభించాయన్న వదంతులు కూడా ఉన్నాయి. కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవడం రెండు పార్టీలకు అత్యంత అవసరం. రాజకీయాల్లో ఎలా గెలిచామన్నది ముఖ్యం కాదు.. గెలిచామా లేదా అన్నదే ముఖ్యం. ఎంత మంది ఎమ్మెల్యేలుగా గెలిచారన్నది కాదు… ప్రభుత్వానికి సరిపడా ఎమ్మెల్యేలను… సమీకరించగలిగామా లేదా అన్నదే ఇంపార్టెంట్. ఈ రేసులో పాల్గొనేందుకు రెండు పార్టీలు ఇప్పటికే పొజిషన్ తీసుకున్నాయి.
కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుుతన్న భారతీయ జనతాపార్టీ ఈ విషయంలో చాలా ముందు ఉంది. గోవా,, మేఘాలయ, మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో తమకు మెజార్టీ రాకపోయినా… ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చాలా ఈజీగా బుట్టలో వేసుకుని ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. కర్ణాటకలో కూడా అదే చేయడానికి ఏర్పాట్లు చేసుకుందని చాలా మంది నమ్ముతున్నారు. గాలి జనార్దన్ రెడ్డి వర్గానికి పెద్ద పీట వేయడానికి ఈ ఎమ్మెల్యేల సమీకరణే కారణం అంటున్నారు. డబ్బుతో ఎవర్నైనా కొనగలమని భావించే వీరు.. గతంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా… కొంత మంది ఎమ్మెల్యేల్నీ సమీకరించారు. ఇప్పుడు అదే మిషన్ ప్రారంభించబోతున్నారని కర్ణాటకలో ప్రచారం జరుగుతోంది.
అటు కాంగ్రెస్‌తో పాటు ఇటు బీజేపీకి కూడా.. జేడీఎస్ చాలా తేలిగ్గా… టార్గెట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే.. కుమారస్వామి, దేవేగౌడ తమ పార్టీ అభ్యర్థులుగా జంప్ జిలానీలకే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. టిక్కెట్ కోసం పార్టీలో చేరిన వారు… గెలిచిన తర్వాత తమను తాము మార్కెట్ చేసుకోకుండా.. పార్టీకే కట్టుబడి ఉంటారనుకోవడం భ్రమే. అందుకే… మే పదిహేనో తేదీన కర్ణాటకలో హంగ్ వస్తే… ప్రజాస్వామ్య సర్కస్ ప్రజల కళ్ల ముందు సాక్షాత్కరించనుంది.