హర్యానాతో పాటు జమ్మూకశ్మీర్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి మంచి అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. పోలింగ్ పూర్తి కావడంతో పలు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. హర్యానాలో చాలా కాలంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ప్రజల్లో వారిపై తీవ్ర వ్యతిరేకత ఉందని తేలింది. ఈ కారణంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ క్లియర్ కట్ విక్టరీ సాధించబోతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు జాబితాలో మరో రాష్ట్రం చేరడం ఖాయమని తేల్చేసాయి.
ఇక జమ్మూ కశ్మీర్ ను విభజించి లద్దాఖ్ లేకుండా నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కూటమికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి . కాంగ్రెస్ ఫరూక్ అబ్దుల్లా పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ తో కలిసి పోటీ చేశారు. ఆ కూటమి వర్కవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కొన్ని సర్వేలు మాత్రం హంగ్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి.
ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ఇండియా కూటమికి నైతిక బలం మరింత పెరిగే అవకాశం ఉంది. త్వరలో మరో ఏడాదిలో మహారాష్ట్ర, బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. అవి గేమ్ ఛేంజర్ గా మారుతాయి. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ ఎదురీదుతోందని ప్రచారం జరుగుతోంది. ఆ రాష్ట్ర ఫలితాలు తేడా వస్తే జాతీయ రాజకీయాలు చాలా వరకూ మారిపోయే అవకాశం ఉంది.