నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీనే మెరుగైన ఫలితాలు సాధిస్తుందని.. ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఐదింటిలో ఎక్కువగా అందరి దృష్టి ఉన్న పశ్చిమ బెంగాల్లో వివిధ రకాల సంస్థలు భిన్నమైన పోల్ సర్వేలు ప్రకటించాయి. అయితే ఎక్కువగా బీజేపీనే గెలుస్తుందని చెప్పాయి. రిపబ్లిక్- సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం..పోరు హోరాహోరీగా ఉంది. అయితే బీజేపీనే కొంత ముందంజలో ఉంది. బీజేపీ 138-148 మధ్య సీట్లు గెలుస్తుంది. టీఎంసీ 128-138 మధ్య కాంగ్రెస్+వామపక్షాలు 11-21 మధ్య సీట్లు గెలుస్తాయని అంచనా వేసింది. అయితే టైమ్స్ నౌ సీఓటర్ సంస్థ మాత్రం… తృణమూల్ 158 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తుందని తేల్చింది. బీజేపీకి 115 రావొచ్చని అంచనా వేశారు. ఏబీపీ-సీఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో కూడా… టీఎంసీకే అధికారం లభించింది. టీఎంసీకి 164 .. బీజేపీకి 121 వరకూ రావొచ్చని తెలిపారు.
అసోంలో అన్ని సర్వేలు ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీకే అధిక్యం లభించింది. బీజేపీకి 85 వరకూ అసెంబ్లీ సీట్లు వస్తాయని పోల్స్టర్స్ లెక్కలేశారు. కాంగ్రెస్ కూటమికి నలభై నుంచి యాభై సీట్లు ఇచ్చారు. ఇక తమిళనాడులోనూ అన్ని ఎగ్జిట్ పోల్స్.. డీఎంకేకు పట్టం కట్టాయి. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అన్ని ఎగ్జిట్స్ పోల్స్ 170 వరకూ సీట్లు వస్తాయని అంచనా వేశాయి. అయితే అన్నాడీఎంకే పార్లమెంట్ ఎన్నికల్లో చూసినంత డిజాస్టర్ చూడదని.. మెరుగైన ఫలితాలు వస్తాయని కనీసం అరవై అసెంబ్లీ స్థానాలు గెల్చుకోవచ్చని చెబుతున్నారు. ఇక కేరళలోనూ అన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రస్తుతం ప్రభుత్వం అయిన ఎల్డీఎఫ్కే పట్టం కట్టాయి. 140 అసెంబ్లీ స్థానాలున్న అసెంబ్లీలో ఎల్డీఎఫ్కు 72-80 సీట్లు రావొచ్చని లెక్కలేశారు. అయితే పోరు వన్ సైడ్ లేదని.. యుడీఎఫ్ కూటమితో హోరాహోరీ ఉంటుందని అంచనా వేశాయి. సగటున.. అరవైనాలుగు సీట్ల వరకూ యూడీఎఫ్ గెల్చుకోవచ్చంటున్నారు. పుదుచ్చేరిలో బీజేపీ గెలుస్తుందని తేల్చాయి.
పోలింగ్ లాగే.. బెంగాల్ లో ఎగ్జిట్ పోల్స్… అటు బీజేపీ విజయాన్ని.. ఇటు టీఎంసీ విజయాన్ని చెప్పాయి. దీంతో.. ఉత్కంఠ ప్రారంభమయింది. ఎడ్జ్ బీజేపీకి ఉన్నట్లుగా కొన్ని సర్వేలు చెప్పాయి. అయితే దీదీకే మొగ్గు అని మరికొన్ని సర్వేలు చెబుతున్నాయి. అంటే.. ఈ రెండు వాదనల్లో ఒకటి ఖచ్చితంగా తప్పు అవడం. అంటే.. ఎగ్జిట్ పోల్స్ చేస్తున్న వాళ్లంతా ఏసీ రూముల్లో కూర్చుని గాలి కబుర్లు పోగేసి.. లేకపోతే.. తమకు అనుకూలమైన పార్టీల కోసం లెక్కలు రాసి విడుదల చేస్తున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు.