ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ తీవ్రంగా నష్టపోయే సూచనలేం కనిపించడం లేదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. దాదాపుగా ప్రతి ఎగ్జిట్ పోల్‌లోనూ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అన్ని సర్వేలను సగటును అంచనావేస్తే 220 నుంచి 250 వరకూ బీజేపీకి సీట్లు రావొచ్చని అంచనా వేయవచ్చు. సమాజ్ వాదీ పార్టీ బలమైన పోటీ ఇచ్చినప్పటికీ ఆ పార్టీ సీట్లు 150 కన్నా తక్కువగానే ఉంటాయనే ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి.
ఇక యూపీ కాకుండా మరో కీలకమైన రాష్ట్రమైన పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఏకపక్ష పోలింగ్ జరిగింది. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం చవి చూడటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రాష్ట్రంలో బీజేపీ మొదటి నుంచి రేస్‌లో లేదు. దీంతో ప్రతిపక్ష స్థానానికి కాంగ్రెస్… ఆ తర్వాత అకాలీదళ్ నిలిచే అవకాశం ఉంది. ఎన్నికల చివరి వరకూ పంజాబ్‌లో హంగ్ వస్తుందని.. ఆమ్ ఆద్మీ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందన్న వార్తలు వచ్చాయి. అయితే పోలింగ్ ముగిసేసరికి సీన్ మారిపోయిందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
ఇక ఉత్తరాఖండ్ , గోవాల్లో హోరాహోరీ పోరు ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఉత్తరాఖండ్‌లో మాత్రం కాస్త మొగ్గు కాంగ్రెస్ పార్టీకి ఉందని అంచనా వేస్తున్నారు. అయితే అతి చాలా తక్కువ ఒకటి.. రెండు సీట్లతోనేనని చెబుతున్నారు. ఇక గోవాలో ఎప్పట్లానే హంగ్ వస్తుంది. కానీ అక్కడ కూడా ఆమ్ ఆద్మీ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మణిపూర్ లో బీజేపీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ లెక్కలేశాయి.
ఈ సారి ఎగ్జిట్ పోల్స్ కనీసం పదిహేను సంస్థలు వరకూ వేశాయి. వీటిలో అత్యంత విశ్వసయనీయమైన.. రెగ్యూలర్‌గా సర్వేలు చేసే.. సీ ఓటర్, టుడేస్ చాణక్యలు కూడా ఉన్నాయి. అయితే ఒక్క ఉత్తరాఖండ్‌లో మాత్రమే కాంగ్రెస్‌కు కాస్త సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి.