ఎంతెంతో దూరం అంటే.. చాలా చాలా దూరం అని చిన్న పిల్లలు పాడుకునే, ఆడుకునే ఆటలాగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణ వ్యవహారం సాగుతోంది. ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండి ఏడాది అవుతోంది. ఆశావహులంతా ఎదురు చూస్తున్నారు. కానీ పదవులు మాత్రం ఎవరికీ ఇవ్వడం లేదు. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చామని కొన్ని పదవులు దక్కుతాయన్న ఆనందం చాలా మంది నేతలకు కలగడం లేదు.
రేవంత్ రెడ్డి ఇప్పటికి ఓ పది సార్లు కెబినెట్ పని మీద ఢిల్లీ వెళ్లి ఉంటారు. ఆయన కూడా వెళ్లడం మానేశారు . తాను చెప్పాల్సినదంతా చెప్పి.. ఇవ్వాల్సిన పేర్లను జాబితా రూపంలో ఇచ్చేసి ఆయన తన భారం దించేసుకున్నారు . ఇక అధికారికంగా పేర్లను పంపి ప్రమాణ స్వీకారానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన బాధ్యత హైకమాండ్ పై ఉంది.కానీ హైకమాండ్ అసలు పట్టించుకోవడంలేదు. దీపావళి తర్వాత మంత్రివర్గ విస్తరణ చేయాలని అనుకున్న రేవంత్‌కు ఇప్పుడా అవకాశం లేకుండా పోతోంది.
మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నందున ఇప్పుడు హైకమాండ్ చాలా బిజీగా ఉంటుందని అంటోంది. మంత్రి వర్గ విస్తరణచేస్తే..దాని సైడ్ ఎఫెక్టులు ఉంటాయని ఎన్నికల సమయంలో అది చిరాకుగా మారుతుందని అందుకే..మహారాష్ట్ర ఎన్నికలు అయ్యే వరకూ పరిస్థితి మారదని అంటున్నారు. అంటే.. ఇదిగో..అదిగో అంటూ వాయిదా పడుతూ వస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. మరో నెల రోజుల తర్వాత అనుకోవచ్చు. ఆ తర్వాత ఉంటుందా అంటే…. మరో కారణంతో వాయిదా కోసం వెయిట్ చేసేవరకూ ఆశలు పెట్టుకోవచ్చు.