ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లాలో ఉన్న అమర రాజా బ్యాటరీస్ సంస్థ తరలింపు తదితర వార్తలపై అమెరికా లోని చికాగో నగరంలో దాదాపు నలబై మంది సమావేశమై తమ అభిప్రాయాలను, ఆందోళనను వ్యక్తపరిచారు. వీరందరూ స్థానిక అరోరా ఉపనగరంలోని ఫాక్స్ వాలీ సెంటర్ నందు శనివారం ఆగష్టు పదునాలుగు తారీఖున సమావేశమయ్యారు. వీరిలో, సంస్థ యొక్క పూర్వ ఉద్యోగులు, చిత్తూరు, సమీప జిల్లాలకు చెందిన, ఆంధ్ర రాష్ట్ర వివిధ ప్రదేశాలకు చెందిన వారు మరియు ఇతర తెలుగు వారు తమ తమ భావాలను, అనుభవాలను మరియు సూచనలను పంచుకొన్నారు.
సమావేశ ప్రారంభంలో యుగంధర్ గారు ఉపన్యసిస్తూ అమర రాజా యాజమాన్యంకు సమాజం పైన గల అంకిత భావం, పదిమంది జీవితాల్లో వెలుగులు నింపాలనే తాపత్రయం, మాతృ భూమికి పుట్టిన గడ్డకు కొండంత సహాయ సహకారాలు అందించాలనే దీక్ష , పట్టుదల, అవిశ్రాన్త కృషే ఆ సంస్థ ఉన్నతికి , అక్కడి సమాజ హితానికి ఇతోధికంగా తోడ్పడ్డయి అనేదానిలో ఎటువంటి సందేహం లేదు అన్నారు. ఆ సంస్థ చైర్మన్ రామచంద్ర నాయుడు గారు 1980 దశకం లోనే చికాగో నగరం లో హిందూ టెంపుల్ స్థాపించడంలో చాల కృషి చేశారు అని, ఎల్లప్పుడూ పది మంది హితం కోరే పనులు చేసే వారు అని అన్నారు.
సంస్థ యొక్క పూర్వ ఉద్యోగులు ప్రతాప్ గారు , నవీన్ తదితరులు మాట్లాడుతూ కాలుష్య, పర్యావరణ, మరియు ఇతర సమాజహిత కార్యక్రమాలు సంస్థలో ఎలా విధిగా పాటిస్తారు అలాగే జాతీయ మరియు అంతర్జాతీయ నిర్దేశిత ప్రమాణాలు ఎలా పాటిస్తారు, తరచూ ఎలా వాటిని బేరీజు వేసుకొంటారు అని సోదాహరణంగ వివరించారు. ఆ సంస్థ ఇంకా కొత్త ఎనర్జీ రంగంలోకి ప్రవేశించాలి అనుకొంటున్న తరుణంలో, మన రాష్ట్రంలోనే విస్తరణ జరిగితే, నిరుద్యోగలకు, ఆర్థికంగా రాష్ట్రానికి మరియు దేశోన్నతికి కారణభూత మవుతుంది అని వారి అభిప్రాయాలను వ్యక్త పరిచారు.
ఆ తరువాత హేమ చంద్ర గారు , మురళి, ఉదయ్, రఘు, హరీష్, రవి, సందీప్ , జీవన్ తదితరులు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావడం, ఉన్న పరిశ్రమలను కాపాడు కోవడం ఎంతో ముఖ్యమని తద్వారా యువతకు ఉద్యోగావకాశాలు పెరగాలని, ముఖ్యంగా అంతర్జాతీయస్థాయిలో పేరు గాంచి గ్రామీణ ప్రాంతాల్లో ఫరిడవిల్లుతున్న అమర రాజా లాంటి సంస్థ తరలింపు రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదని సూచించారు. వూహించనిదేమైనా జరిగి అమర రాజా తరలిపోతే , ఇతర కంపెనీలు రాష్ట్రానికి రావడం ఇబ్బందికరంగా మారుతుందని అన్నారు. ప్రభుత్వ ఆర్థికాభివృద్ధి విధానాలు పరిశ్రమలకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండాలని తద్వారా రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకుంటున్నామన్నారు.
చివరగా చిరంజీవి మాట్లాడుతూ ఒక వేళ కాలుష్యం ఉన్న దాని ప్రభావం మొట్టమొదటగా ఆ యజమాన్యము మీదే ఉండేదని, ఎందుకంటే అదే యాజమాన్య స్థిర ఆవాసం అని, వారు గత 3.5 దశాబ్దాలకు పైగా అక్కడే వున్నారని అభిప్రాయ పడ్డారు. నవ్యాన్ద్ర ఉజ్వల భవిష్యత్ కోసం , భావి తరాల అభ్యున్నతి, సమాజ శ్రేయస్సు కోసం మంచి పరిశ్రమలు, వాటి పురోగమనం ఎంతగానో అవసరమని, తద్వారా అవి ఆర్థిక పరి పుష్టి గల నవ సమాజ నిర్మాణానికి ఎంతగానో సహాయ పడుతాయి అని అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. ఈ సమావేశానికి సహాయ పడ్డ శ్రీనివాస్ , ప్రతాప్, రవి , వీరన్న, హనుమంత్ , కృష్ణ మోహన్, మరియు పవన్ తదితరులకు, అలాగే పాల్గొన్న ఎన్నారైలకు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.