ప్రశాంత్ వర్మ ‘హను – మాన్’ సినిమా తీస్తున్నాడు అనగానే ఎవరూ పెద్దగా ఆశ్చర్యపోలేదు. ప్రశాంత్ ముందు నుంచీ.. కొత్త దారిలో వెళ్లే దర్శకుడే. తన టేకింగ్ ఎలా ఉంటుందో జనాలు చూశారు. కానీ.. తేజ సజ్జాతో రూ.25 కోట్లు పెట్టి ఎందుకింత సాహసం చేస్తున్నాడు? అసలు ఏముంటుంది? ఆ సినిమాలో? వర్కవుట్ అవుతుందా, లేదా? అంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఎందుకంటే తేజా సజ్జా సోలో హీరోగా జాంబిరెడ్డితో హిట్టు కొట్టాడు కానీ, వసూళ్ల పరంగా పెద్ద అద్భుతాలేం సృష్టించలేదు. తేజాతో రూ.10 కోట్ల సినిమా ఓకే. మరీ మూడు రెట్లు బడ్జెట్ పెంచేయడం చర్చనీయాంశం అయ్యింది.
అయితే ఇప్పుడు టీజర్ వదిలాడు ప్రశాంత్ వర్మ. ఆ టీజర్లో విజువల్స్.. మేకింగ్, గ్రాఫిక్స్ ఇవన్నీ చూస్తే జనాల మతి పోతోంది. పాతిక కోట్లతో ఇంత పెద్ద స్థాయిలో సినిమా తీస్తాడని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు టాలీవుడ్ అంతా.. ఈ టీజర్ గురించే చర్చ. అందరి నోటా.. `వావ్ హనుమాన్` అనే వినిపిస్తోంది. ఎలాంటి ప్రచార ఆర్భాటాలూ లేకుండా ప్రశాంత్ వర్మ గప్ చుప్‌గా తన పని తాను చేసుకొంటూ పోయాడు. ”నా సినిమాలకంటే టీజర్లూ,ట్రైలర్లు బాగుంటాయని బయట చెబుతుంటారు. ఈ టీజర్ ఎంత బాగుందో ట్రైలర్ అంత బాగుంటుంది. ట్రైలర్ కన్నా సినిమా బాగుంటుంది” అంటూ ఇంకా ఇంకా ఊరించేశాడు. ఈసినిమాలో ఇలాంటి సర్ప్రైజ్లు చాలా ఉన్నాయన్నది జనాల మాట.
అయితే మరో వర్గం ఇప్పుడు ‘హను మాన్’తో ‘ఆదిపురుష్’ టీజర్‌ని పోలుస్తోంది. పాతిక కోట్లతో ప్రశాంత్ వర్మ ఈ స్థాయిలో విజువల్స్ ఇచ్చాడు కదా.. మరి ఓం రౌత్ ఏంటి అలా చేశాడంటూ మీమ్స్ మొదలెట్టేశారు. ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్టు.. హనుమాన్ వెళ్లి… ఆదిపురుష్ పై పడ్డాడు. నిన్నా మొన్నటి వరకూ ‘హను మాన్’పై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. టీజర్ తో ఇప్పుడు వంద రెట్ల బాధ్యత ప్రశాంత్ వర్మపై పడింది. ఇక నుంచి హనుమాన్ నుంచి ఏ చిన్న ప్రచార చిత్రం వచ్చినా .. ఇదే స్థాయి క్వాలిటీ ఆశిస్తారు. సినిమాపైనా ఒత్తిడి పెరుగుతుంది. దీన్నంతా ‘హనుమాన్’ ఎలా బ్యాలెన్స్ చేసుకొంటాతడన్నదానిపై ఈ సినిమా విజయం ఆధార పడి ఉంటుంది. కాకపోతే… త్వరలోనే తెలుగు నుంచి మరో విజువల్ వండర్ చూడబోతున్నామన్న ధీమా మాత్రం ‘హనుమాన్’ ఇచ్చేసింది.