డిసెంబరు 16.. ప్రపంచ సినిమా మొత్తం.. ఈ రోజు ఎప్పుడొస్తుందా? అని వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. అది అవతార్ 2 రిలీజ్ డేట్. అవతార్ లో జేమ్స్ కెమరూన్ సృష్టించిన అద్భుతం ఇంకా కళ్ల ముందు కదులతూనే ఉంది. ఆ సినిమా విడుదలైన పన్నెండేళ్లకు సీక్వెల్ వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 160 భాషల్లో విడుదల అవుతున్న సినిమా ఇది. ఇన్ని భాషల్లో ఓ సినిమా రిలీజ్ కావడం.. ఇదే రికార్డ్. దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ సినిమాని రూపొందించారు. ప్రపంచ సినీ చరిత్రలో ఇదే ఖరీదైన చిత్రం. ఈ సినిమా కోసం కొత్త కెమెరాల్నీ, కొత్త టెక్నాలజీనీ కనిపెట్ట వలసి వచ్చింది. 90 శాతం చిత్రీకరణ నీటిలోనే జరిగింది. వారం రోజుల క్రితం… లండన్ లో ప్రీమియర్ షో ప్రదర్శించారు. ఈ షోకి హాజరైన క్రిటిక్స్ దీన్నో మాస్టర్ పీస్ గా అభివర్ణిస్తున్నారు. ఇండియాలోసైతం ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాలలో అడ్వాన్స్ బుకింగులు మొదలైపోయాయి. త్రీడీ స్క్రీన్స్ అన్నీ దాదాపుగా ఫుల్ అయ్యాయి. ప్రసాద్ మల్టీప్లెక్స్ లోని బిగ్ స్క్రీన్లో ఈ సినిమాని చూడాలని నగర వాసులు తహతహలాడుతున్నారు. ఈ థియేటర్లో టికెట్లు ఎప్పుడో అయిపోయాయి. ఈనెల 16న తెలుగు నాట పెద్ద సినిమాలేం విడుదల కావడం లేదు. అదంతా.. `అవతార్ 2` ఎఫెక్టే అనుకోవాలి. ఓ పెద్ద హీరో సినిమా విడుదలైతే ఎంత హడావుడి ఉంటుందో.. అవతార్ 2కి అంత హడావుడి కనిపిస్తోంది. ఓ హాలీవుడ్ డబ్బింగ్ సినిమా కోసం ఇంత చర్చ జరగడం ఇదే తొలిసారేమో..? మరి అవతార్ 2 ఈ అంచనాల్ని ఎంత వరకూ నిలబెట్టుకొంటుందో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాలి.