దాదాపు నాలుగయిదు వారాల నుంచి బాక్సాఫీసు ముందుకు సినిమాలు వస్తున్నాయి, పోతున్నాయి. కాస్త లాభాలు కళ్లచూసిన సినిమాలు ఒకటి, రెండింటికి మించి లేవు. వచ్చేవారం కూడా మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ (విజేత), తమిళ్ హీరో కార్తీ(చినబాబు) తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నారు. వీరితో పాటు కొత్త హీరో కార్తికేయ కూడా తన స్వంత బ్యానర్ లో ఆర్ ఎక్స్ 100 అనే సినిమాతో వస్తున్నాడు.
కళ్యాణ్ దేవ్ సినిమా విజేత కు బ్యానర్ వాల్యూ వుంది. పైగా మెగా హీరో అనే ట్యాగ్ వుంది. ఇక కార్తీకి ఇప్పటికే ఎస్టాబ్లిష్డ్ హీరోగా ఇంతో అంతో ఫాలోయింగ్ వుంది. ఎటొచ్చీ కార్తికేయకు మాత్రం అలాంటివి లేవు. కానీ బయటకు వచ్చిన రెండు ట్రయిలర్లు ఆ సినిమా మీద కాస్త ఆసక్తి పెంచాయి. వర్మ స్కూలు నుంచి వచ్చిన అజయ్ భూపతి కాస్త ఎగ్రెసివ్ టైపు లవ్ స్టోరీని తెరకెక్కించాడు.
మరి ఆ రెండు సినిమాలను ఈ సినిమా తట్టుకుని, థియేటర్లో వుండాలి అంటే కంటెంట్ ఒక్కటే శరణ్యం. ఈ మధ్య అర్జున్ రెడ్డి తరువాత ఈ తరహా సినిమాలకు కాస్త ధైర్యం వచ్చింది. కానీ మరీ అలా అని తమిళ నాటు సినిమాల మాదిరిగా వుంటే మాత్రం కష్టం. మొత్తం మీద ఆ రెండు కుందేళ్ల దగ్గర ఈ తాబేలు ఏమవుతుందో చూడాలి.