ఈనెల 15న వస్తున్న సినిమాల్లో ‘మిస్టర్ బచ్చన్’ ఒకటి. రవితేజ – హరీష్ శంకర్ కాంబోలో రూపుదిద్దుకొన్న సినిమా ఇది. రవితేజ బాడీ లాంగ్వేజ్‌ని పూర్తిగా అర్థం చేసుకొన్న దర్శకుల్లో హరీష్ ఒకడు. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. వారిద్దరి ఎనర్జీ కూడా ఈ సినిమాకు ప్లస్. ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషన్ కంటెంట్ లో పాటలు, గ్లామర్‌కే పెద్ద పీట వేశాడు దర్శకుడు. చిత్రబృందం కూడా వాటినే ఎక్కువ నమ్ముకొన్నట్టు అర్థమవుతోంది. పాటల్లో భాగ్యశ్రీ అందాలపై ఫోకస్ చేసిన హరీష్… పబ్లిసిటీలోనూ అదే అస్త్రంగా వాడుతున్నాడు. ఈరోజు ట్రైలర్ వస్తోంది. అది చూస్తే తప్ప, హరీష్ నుంచి ఎలాంటి కంటెంట్ రాబోతోందో అర్థం కాదు.
‘ధమాకా’ విషయంలో ఇదే జరిగింది. కంటెంట్ పరంగా చూస్తే `ధమాకా`కు అత్తెసరు మార్కులే పడతాయి. అయితే పాటలు, శ్రీలీల గ్లామర్ `ధమాకా`ను కాపాడాయి. దానికి తోడు `ధమాకా` సోలో రిలీజ్. రెండు వారాల వరకూ పెద్దగా పోటీ లేదు. అందుకే `ధమాకా` దూసుకుపోయింది. `మిస్టర్ బచ్చన్`లో ప్లస్ పాయింట్లు పాటలూ, గ్లామరే. కానీ ఈసారి మాత్రం `డబుల్ ఇస్మార్ట్` రూపంలో రవితేజకు గట్టి పోటీ ఉంది. సో.. గ్లామరే నమ్ముకొంటే పని జరగదు. హరీష్ శంకర్ కు మంచి కామెడీ టైమింగ్ ఉంది. రవితేజ గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో కామెడీకి ఎంత స్కోప్ ఉంది? సీరియస్ కథలో ఎంటర్టైన్మెంట్ ఎంత వరకూ జొప్పించారు? అనే అంశాల మీదే.. ‘మిస్టర్ బచ్చన్’ భవితవ్యం ఆధార పడి ఉంది.
మరోవైపు ఈ సినిమా డెఫిషిట్లో విడుదల అవుతున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు దాదాపు రూ.92 కోట్ల బడ్జెట్ అయ్యింది. బిజినెస్ చూస్తే రూ.70 కోట్లే జరిగింది. అంటే రూ.22 కోట్ల లోటుతో ఈ సినిమాని విడుదల చేస్తున్నారన్నమాట.