హైదరాబాదీ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా యుఎస్ లో ఎన్ని అద్భుతాలు చేస్తుందో అని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. క్రితంసారి మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ ను సాధించడమే దీనికి కారణం. దక్షిణాఫ్రికా ఆటగాడితో కలిసి సానియా నిరుడు విజేతగా నిలిచింది. ఈసారి సానియా మిక్స్ డ్ డబుల్స్ కు బదులు మహిళల డబుల్స్ లో వండర్స్ చేయవచ్చని భావిస్తున్నారు. అనుకున్నట్టే సానియా జోడీ శుభారంభం చేసింది. మార్టినా హింగిస్ తో కలిసి సానియా తొలి మ్యాచ్ లో విజయం సాధించింది.
ఇటీవల మహిళల డబుల్స్ లో సానియా జోడీ హవా నడుస్తోంది ఇద్దరి మధ్య చక్కని సమన్వయం కుదిరింది. కోర్టులో ఏమాత్రం తడబడకుండా ప్రత్యర్థులను ఓ ఆట ఆడుకుంటున్నారు. కాబట్టి ఈసారి యుఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ లో సానియా చాంపియన్ గా తిరిగి వస్తుందని అభిమానులు భారీగానే అంచనాతో ఉన్నారు.bమరోవైపు, భారతీయ క్రీడాకారుడు లియాండర్ పేస్ పురుషుల డబుల్స్ లో శుభారంభం చేశాడు. పేస్ జోడీ తొలి మ్యాచ్ లో విజయం సాధించి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. అటు సానియాతో పాటు పేస్ కూడా టైటిల్ సాధిస్తే అది భారత్ కు డబుల్ ధమాకా అవుతుంది.
ఈసారి యుఎస్ ఓపెన్ ప్రారంభంలోనే ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కాలి గాయం పేరుతో రష్యా స్టార్ మరియా షరపోవా టోర్నీ నుంచి వైదొలగింది. అందమైన, అద్భుతమైన టెన్నిస్ ప్లేయర్ గా గుర్తింపు ఉన్న మరియా ఇలా నిష్క్రమించడం అభిమానులను నిరాశ పరిచింది. ఆ సంగతి ఎలా ఉన్నా సానియా, పేస్ లు టైటిల్ సాధించే క్షణం కోసం వేచి చూద్దాం.